అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!

అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Updated : 28 Mar 2024 05:58 IST

 భారతీయ సిబ్బంది సురక్షితం, ఒకరికి స్వల్ప గాయాలు
ముందుగా హెచ్చరించిన సిబ్బందిపై బైడెన్‌ ప్రశంసల జల్లు

బాల్టిమోర్‌: అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో నౌకలోని భారతీయ సిబ్బంది క్షేమమని, ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయని షిప్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సినర్జీ ప్రకటించింది. అందులో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. ఇద్దరు పైలట్లుసహా అందరిని గుర్తించినట్లు చెప్పింది. మరోవైపు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అధికారులను హెచ్చరించి పలువురి ప్రాణాలను కాపాడిన నౌక సిబ్బందిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రశంసల జల్లు కురిపించారు.

తప్పిన పెను ప్రమాదం

ప్రమాదం జరిగినప్పుడు ముందు నౌకలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని, వెంటనే ప్రమాద సంబంధ సమాచారాన్ని నౌకా సిబ్బంది అధికారులకు అందించారని, వెంటనే వంతెనపై వాహనాలను ఆపేయడంతో భారీ ముప్పు తప్పిందని బాల్టిమోర్‌ అగ్నిమాపకశాఖ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ కెవిన్‌ కార్ట్‌రైట్‌ తెలిపారు. మరోవైపు ప్రమాదాన్ని గుర్తించిన పైలట్‌ ఓడ వేగాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి నౌక ప్రమాదంలో చిక్కుకుందని తెలిసిన వెంటనే 12 సెకన్ల హెచ్చరికను రేడియో సంకేతాల ద్వారా సిబ్బంది అమెరికా అధికారులకు పంపారు. వారు 90 సెకన్లలోని వంతెనపై ట్రాఫిక్‌ను నిలిపేశారు. స్టీరింగ్‌పై అదుపు కోల్పోవడంతో నౌక వెళ్లి వంతెన పిల్లర్‌ను ఢీకొంది.

మరమ్మతు సిబ్బందే

మరణించారని భావిస్తున్న వారంతా వంతెనపై గుంతలు పూడుస్తున్నారని మేరీలాండ్‌ రవాణాశాఖ కార్యదర్శి పాల్‌ వైడెఫెల్డ్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది లోతు, కనిపించకుండా పోయిన తర్వాత గడిచిన సమయాన్ని బట్టి చూస్తే మరణించి ఉంటారని వారిని నియమించుకున్న కంపెనీ బ్రానర్‌ బిల్డర్స్‌ పేర్కొంది. పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెనను నౌక ఢీకొనడంతో వంతెన మొత్తం కుప్పకూలిన విషయం తెలిసిందే.

మీవల్లే ఎన్నో ప్రాణాలు నిలిచాయి: బైడెన్‌

వాషింగ్టన్‌: నౌక ఢీకొనడంతో పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెన కుప్పకూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. సహాయక సిబ్బంది, నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ‘ఓడ తమ నియంత్రణ కోల్పోయిందని గుర్తించిన సిబ్బంది వెంటనే స్పందించి మేరీలాండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అథారిటీని అప్రమత్తం చేశారు. దాంతో స్థానిక అధికారులు వంతెనపై రాకపోకలను ఆపివేయగలిగారు. వారి అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడింది’ అని బైడెన్‌ వెల్లడించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే తాను బాల్టిమోర్‌ను సందర్శిస్తానని బైడెన్‌ వెల్లడించారు.

స్పందించిన భారత ఎంబసీ

ఈ ఘటనపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌(ట్విటర్‌)లో స్పందించింది. ఈ దుర్ఘటనవల్ల ప్రభావితమైన భారతీయ పౌరుల సహాయార్థం ప్రత్యేక హాట్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

‘జూన్‌లోనే లోపాన్ని గుర్తించాం’

బాల్టిమోర్‌లో ప్రమాదానికి గురైన నౌకలో లోపాన్ని గత ఏడాది జూన్‌లో గుర్తించామని ఇన్‌స్పెక్టర్లు తెలిపారు. అయితే ఇటీవల జరిపిన తనిఖీలో ఎటువంటి లోపం బయటపడలేదని షిప్సింగ్‌ సమాచార వ్యవస్థ ఈక్వాసిస్‌ వెల్లడించింది. 2015లో తయారైన ఈ నౌకను 27 సార్లు తనిఖీ చేశామని ఇన్‌స్పెక్టర్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు