16కు చేరిన లెబనాన్‌ మృతులు

లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్‌ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి.

Published : 29 Mar 2024 06:34 IST

జెరూసలెం: లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్‌ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. గురువారం నాటికి వారి సంఖ్య 16కు చేరుకుంది.

  • ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో గురువారం ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు.
  • గాజాలోని అల్‌ అమల్‌ ఆసుపత్రి మూతపడింది. మిలిటెంట్ల కార్యకలాపాలు పెరగడంతో ఈ చర్య తీసుకున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో గాజాలోని 36 ఆసుపత్రుల్లో ప్రస్తుతం 12 మాత్రమే పని చేస్తున్నాయి.
  • ఆన్‌లైన్‌ మీడియా సంస్థ ‘గాజా నౌ’పై అమెరికా ఆంక్షలు విధించింది. హమాస్‌కు మద్దతు పలుకుతున్నందున సంస్థతోపాటు దాని వ్యవస్థాపకుడు ముస్తాఫా ఆయాష్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

రఫా నుంచీ వెళ్లాల్సిందే: నెతన్యాహు

గాజాలోని రఫా ప్రాంతంలో భూతల దాడులకు దిగబోతున్నామని, అక్కడ ఆశ్రయం పొందుతున్న లక్షల మంది వెళ్లిపోవాల్సిందేనని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. రఫాకు వెళ్లినవారు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

పాలస్తీనాకు కొత్త కేబినెట్‌

అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేసినట్లు పాలస్తీనా అథారిటీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రత్యేక డిక్రీ ద్వారా కొత్త కేబినెట్‌పై ఆ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. దశాబ్దాలుగా పాలస్తీనా అథారిటీకి నాయకత్వం వహిస్తున్న అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌ పాత్ర మారలేదు. మిగిలిన వారంతా కొత్తవారే. ఈ నెల మొదటి వారంలో మహమ్మద్‌ ముస్తాఫాను ప్రధానిగా అబ్బాస్‌ నియమించారు. కొత్త కేబినెట్‌లో ఆయన విదేశాంగ మంత్రిగానూ బాధ్యతలను నిర్వర్తిస్తారు.

అల్‌-అఖ్సా మసీదును విముక్తి చేద్దాం: హమాస్‌

జెరూసలెంలోని అల్‌-అఖ్సా మసీదుకు విముక్తి కల్పించేందుకు చేసే పోరాటంలో కలిసి రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలకు హమాస్‌ పిలుపునిచ్చింది. ఇందుకోసం రేపు కాదని, ఈరోజే మార్చ్‌ను ప్రారంభించాలని కోరింది. మహమ్మద్‌ డెయిఫ్‌ గొంతుతో ఉన్న ఒక ఆడియో సందేశాన్ని బుధవారం హమాస్‌ టెలిగ్రాం ఛానల్‌ద్వారా విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని