అత్యంత సమీపానికి అమెరికా-రష్యా శాటిలైట్లు

అంతరిక్షంలో భారీ ముప్పు తప్పింది. రష్యాకు చెందిన ఓ శాటిలైట్‌.. నాసాకు చెందిన మరో శాటిలైట్‌ అత్యంత చేరువకు వచ్చినట్లు వెల్లడైంది.

Published : 12 Apr 2024 05:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్షంలో భారీ ముప్పు తప్పింది. రష్యాకు చెందిన ఓ శాటిలైట్‌.. నాసాకు చెందిన మరో శాటిలైట్‌ అత్యంత చేరువకు వచ్చినట్లు వెల్లడైంది. వీటి మధ్య కేవలం 10 మీటర్ల కంటే తక్కువ దూరం నమోదైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదకర పరిణామం.. తమనెంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ఒకవేళ ఈ రెండూ ఢీకొని ఉంటే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉండేదని పేర్కొంది. భూ వాతావరణాన్ని పర్యవేక్షించేందుకు టైమ్‌డ్‌ (టీఐఎంఈడీ) ఉపగ్రహాన్ని నాసా అంతరిక్షంలోకి పంపింది. రష్యాకు చెందిన ‘కాస్మొస్‌ 2221’ శాటిలైట్‌.. ప్రస్తుతం పనిచేయడం లేదు. ఫిబ్రవరి 28న ఈ రెండు ఉపగ్రహాలు అత్యంత చేరువలోకి వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘‘కేవలం 10 మీటర్ల దూరంలోనే ఈ ఉపగ్రహాలు ప్రయాణించినట్లు ఇటీవల గుర్తించాం. గంటకు 10 వేల మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ ఉపగ్రహాలు ఒకవేళ ఢీకొని ఉంటే పరిస్థితి భయంకరంగా ఉండేది. పరిణామాలు తీవ్రంగా ఉండేవి. యూఎస్‌ ఉపగ్రహం కూడా తీవ్రంగా దెబ్బతినేదే’’ అని నాసా పర్యవేక్షకుడు కొలొనెల్‌ పామ్‌ మెల్‌రాయ్‌ పేర్కొన్నారు. ఆ పరిణామం తనతోపాటు నాసా మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని, చిన్న శకలాలు కూడా భూమిపై తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని అన్నారు.

ఐఎస్‌ఎస్‌లో వాయు లీకేజీ నిజమే: రష్యా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో తమ విభాగంలో వాయువు లీక్‌ అవుతున్న విషయాన్ని రష్యన్‌ అధికారులు ధ్రువీకరించారు. దానివల్ల ఐఎస్‌ఎస్‌కు, అందులోని సిబ్బందికి ఎటువంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. వీటిని నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, ఏవైనా లోపాలు గుర్తిస్తే వాటిని వెంటనే సరిదిద్దే ప్రయత్నం సిబ్బంది చేస్తారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు