దక్షిణ కొరియా ఎన్నికల్లో ప్రతిపక్షాల ఘన విజయం

దక్షిణ కొరియా పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష ఉదారవాద పార్టీలు ఘన విజయం సాధించాయి. 300 స్థానాలకు ఎన్నికలు జరగ్గా గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రాటిక్‌ పార్టీ, దాని మిత్రపక్షం 175 సీట్లను సొంతం చేసుకున్నాయి.

Published : 12 Apr 2024 05:29 IST

 300 సీట్లలో 175 కైవసం
అధికార పార్టీకి 109 స్థానాలు

సియోల్‌: దక్షిణ కొరియా పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష ఉదారవాద పార్టీలు ఘన విజయం సాధించాయి. 300 స్థానాలకు ఎన్నికలు జరగ్గా గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రాటిక్‌ పార్టీ, దాని మిత్రపక్షం 175 సీట్లను సొంతం చేసుకున్నాయి. మరో ఉదారవాద పార్టీకి దామాషా పద్ధతిలో 12 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు యూన్‌ సూక్‌ యోల్‌కు చెందిన అధికార పీపుల్‌ పవర్‌ పార్టీ, దాని మిత్రపక్షం కలిపి 109 సీట్లు మాత్రమే సాధించాయి. కౌంటింగ్‌ చివరి దశలో ఉండటంతో అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరో మూడేళ్లు పదవిలో కొనసాగనున్న యూన్‌ సూక్‌ యోల్‌కు ప్రస్తుత ఫలితాలతో ఇబ్బందికర పరిస్థితే అని చెప్పొచ్చు. అయితే ఈ ఫలితాలతో ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటుపై పూర్తి అధికారం వచ్చే అవకాశం లేదు. అధ్యక్షుడు వీటో చేసిన బిల్లులను ఆమోదించాలన్నా, ఆయనను పదవిలోంచి దించాలన్నా వారికి 200 సీట్లతో సూపర్‌ మెజారిటీ అవసరం. ప్రస్తుతం ఉన్న సీట్లతో ప్రతిపక్షాలు పార్లమెంటుపై తమ పట్టును బిగించే అవకాశం ఉంది. తద్వారా అధ్యక్షుడు యోల్‌.. చాలా పరిమితుల మధ్య తన అధికారాలను చెలాయించాల్సి ఉంటుంది.

ప్రధాని రాజీనామా..

ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చవిచూడటంతో దేశ ప్రధాని హాన్‌ డక్‌ సూ, ఉన్నతస్థాయి అధికారులు పలువురు తమ పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వీటిని అధ్యక్షుడు ఆమోదించారా లేదా అనేదానిపై స్పష్టత లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని