సంక్షిప్త వార్తలు (3)

సరిహద్దు వివాద పరిష్కారంలో భారత్‌-చైనాలు గొప్ప సానుకూల పురోగతి సాధించాయనీ, ఉభయ పక్షాలు క్రమం తప్పకుండా సంప్రదించుకుంటున్నాయని చైనా విదేశాంగ శాఖ సీనియర్‌ ప్రతినిధి మావో నింగ్‌ శుక్రవారం ఉద్ఘాటించారు.

Updated : 13 Apr 2024 06:05 IST

సరిహద్దు వివాద పరిష్కారంలో సానుకూల పురోగతి: చైనా

బీజింగ్‌: సరిహద్దు వివాద పరిష్కారంలో భారత్‌-చైనాలు గొప్ప సానుకూల పురోగతి సాధించాయనీ, ఉభయ పక్షాలు క్రమం తప్పకుండా సంప్రదించుకుంటున్నాయని చైనా విదేశాంగ శాఖ సీనియర్‌ ప్రతినిధి మావో నింగ్‌ శుక్రవారం ఉద్ఘాటించారు. దౌత్య, సైనిక స్థాయుల్లో సానుకూల, నిర్మాణాత్మక చర్చల ద్వారా భారత్‌, చైనాలు సరిహద్దులో ప్రశాంత పరిస్థితులను పునరుద్ధరించుకుంటాయని ఆశిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ప్రకటనపై గురువారం ఈ మేరకు చైనా ప్రతినిధి స్పందించారు. సరిహద్దు సమస్య భారత్‌-చైనా సంబంధాల్లో చిన్న భాగం మాత్రమేననీ, దాన్ని సక్రమంగా పరిష్కరించుకోవడం ముఖ్యమని మావో అన్నారు. విభేదాల పరిష్కారానికి చైనాతో చేయి కలిపి భారత్‌ ముందుకు సాగాలని కోరారు.


మయన్మార్‌లో ప్రమాదకర పరిస్థితులు.. సిత్వే నుంచి భారత కాన్సులేట్‌ సిబ్బంది తరలింపు

దిల్లీ: సైనిక బలగాలు, తిరుగుబాటు దళాల మధ్య భీకర పోరు కొనసాగుతుండటంతో మయన్మార్‌లో భద్రతా పరిస్థితులు ప్రమాదకరంగా మారాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా రఖైన్‌ ప్రావిన్సులో తీవ్ర సంక్షుభిత వాతావరణం నెలకొందని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడి సిత్వే నగరం నుంచి భారత కాన్సులేట్‌ కార్యాలయ సిబ్బందిని యంగోన్‌కు తరలించినట్లు శుక్రవారం మీడియాతో సమావేశంలో వెల్లడించారు. మయన్మార్‌లో ముగ్గురు భారతీయ యువకులు అపహరణకు గురైనట్లు వస్తున్న వార్తలపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు జైస్వాల్‌ స్పందిస్తూ.. ఆ ముగ్గురూ త్వరలోనే సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటారని ఆశిస్తున్నామన్నారు.


సమాచార మాధ్యమాలపై మాలిలో నిషేధం

బమాకో: టీవీ, రేడియా, ఆన్‌లైన్‌, ప్రింట్‌ పత్రికలు దేశంలోని రాజకీయ పార్టీలు, సంఘాల కార్యకలాపాల గురించి వార్తలు ప్రచురించకూడదని మాలి ప్రకటించింది. అన్ని రాజకీయ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఒకరోజు వ్యవధిలోనే సైనిక ప్రభుత్వం గురువారం అన్ని సమాచార మాధ్యమాలపై నిషేధం విధించింది. రాజకీయ కార్యకలాపాలను నిషేధించి, పత్రికా స్వేచ్ఛను హరించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 2012లో మాలిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేపట్టిన సైనిక పాలకులు 2024 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు. కానీ ఎన్నికలను రద్దుచేస్తున్నట్లు గత సెప్టెంబరులో ప్రకటించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని