ఇరాన్‌పై ప్రతిదాడి తప్పదు

పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది! తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

Updated : 16 Apr 2024 05:50 IST

 ఇజ్రాయెల్‌ ప్రకటన

టెల్‌ అవీవ్‌, టెహ్రాన్‌, వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది! తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఆ దేశంపై ప్రతిదాడి తప్పదని.. ఇందుకోసం ‘ఆపరేషన్‌ ఐరన్‌ షీల్డ్‌’ చేపడతామని ఇజ్రాయెల్‌ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జి హలేవి స్పష్టం చేశారు. నెవిటమ్‌ వైమానిక స్థావరంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘మా వ్యూహాత్మక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్‌ భావించింది. ముందెన్నడూ ఇలాంటిది చోటుచేసుకోలేదు. ‘ఐరన్‌ షీల్డ్‌’ ఆపరేషన్‌కు మేం సిద్ధమవుతున్నాం’’ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ శనివారం రాత్రి 300కుపైగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని అమెరికా నిఘా వర్గాలు కూడా అంటున్నాయి. ఇప్పుడు స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్‌ నుంచి మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని టెల్‌ అవీవ్‌ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ప్రతిదాడి విషయంలో తాము ఇజ్రాయెల్‌ను నిర్దేశించలేమని.. నచ్చిన నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని అమెరికా తెలిపింది.

అమెరికా అండగా నిలవకపోయినా..

అగ్రరాజ్యం అండగా నిలిచినా నిలవకపోయినా.. ఇరాన్‌పై ప్రతిదాడి విషయంలో ముందుకే వెళ్లాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సహా మంత్రిమండలిలో ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సోమవారం అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌కు చెప్పినట్లు సమాచారం. ‘‘మాకు దాడి చేయడం తప్ప మరో మార్గం లేదు’’ అని ఆస్టిన్‌తో ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి గలాంట్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ విషయం తేలేవరకు గాజాలోని రఫాపై ఆపరేషన్‌ను నిలిపివేయాలని నెతన్యాహు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతిదాడికి ఇజ్రాయెల్‌  ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టెహ్రాన్‌ హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడిపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. సంయమనం పాటించాలని ఇరుపక్షాలకు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ విజ్ఞప్తి చేశారు.

దాడి చేస్తామని ముందే చెప్పాం

ఇజ్రాయెల్‌పై దాడి సమాచారాన్ని అమెరికాకు 72 గంటలకు ముందే తెలిపామని ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి హసేన్‌ అమీర్‌ అబ్దుల్ల్లా హియాన్‌ అన్నారు. ‘‘పౌర లక్ష్యాలను మేం గురిపెట్టలేదు. వాణిజ్య, జనసమూహ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడి ఇజ్రాయెల్‌ను శిక్షించేందుకు, మమ్మల్ని రక్షించుకునేందుకు తీసుకున్న చర్య. దీని గురించి మేం ముందుగానే అమెరికాకు సమాచారం ఇచ్చాం. మా దాడులు పరిమితంగా ఉంటాయని చెప్పాం’’ అని వెల్లడించారు. అయితే తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని అమెరికా పేర్కొంది. ‘‘ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. లక్ష్యాలు ఇవి అని కూడా చెప్పలేదు. దాడి ప్రారంభమైన తర్వాతే సమాచారమిచ్చారు’’ అని పేర్కొంది. ఇరాక్‌, తుర్కీయే, జోర్డాన్‌ అధికారులు మాత్రం తమకు ముందస్తు సమాచారం ఇరాన్‌ నుంచి అందిందని తెలిపారు.

జోర్డానే కాదు.. సౌదీ కూడా..

ఇరాన్‌ దాడి సమయంలో తాము ఇజ్రాయెల్‌కు సాయం చేశామని సౌదీ అరేబియా తెలిపింది. ఇప్పటికే ఈ విషయాన్ని జోర్డాన్‌ బహిరంగంగానే అంగీకరించింది. శనివారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ 300కి పైగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని ఇరాక్‌ గగనతలంపై నుంచి వెళితే.. మరికొన్ని జోర్డాన్‌, సౌదీ గగనతలాల మీదుగా దూసుకెళ్లాయి. తమ గగనతలంపైకి వచ్చిన వాటిని తాము నేలకూల్చామని సౌదీ అరేబియా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని