కడుపుకోతల యుద్ధం

యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలెంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటనే నిదర్శనం.

Updated : 22 Apr 2024 05:54 IST

ఇజ్రాయెల్‌ దాడుల్లో నిండు గర్భిణి మృతి
ఆ మహిళ గర్భంలోంచి పసికందును సురక్షితంగా బయటికి తీసిన వైద్యులు
రఫాలో ఒక్కరోజే 18 మంది చిన్నారుల బలి

రఫా (గాజా స్ట్రిప్‌): యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలెంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటనే నిదర్శనం. శనివారం రాత్రి ఇజ్రాయెల్‌ జరిపిన గగనతల దాడుల్లో భర్త, భార్య, వారి ముద్దుల చిన్నారి మృతి చెందారు. సదరు మహిళ నిండు గర్భిణి. దీంతో ఆమె మృత దేహాన్ని ఆగమేఘాల మీద రఫాలోని కువైట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆ మహిళ గర్భంలోంచి పసికందును సురక్షితంగా బయటికి తీశారు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇదొక్క సంఘటనే కాదు..  ఏడు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో ఇలాంటి విషాదకర దృశ్యాలెన్నో. తాజా ఘటనకు రఫా నగరం వేదికైంది. ఈజిప్టు సరిహద్దుల్లోని ఈ నగరంపై దాడి చేయొద్దని గత కొంతకాలంగా అమెరికా, ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూనే ఉన్నాయి. టెల్‌అవీవ్‌ ఖాతరు చేయడం లేదు. ఇటీవలే రఫాపై దాడులు ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతూనే ఉంది. శనివారం రాత్రి రఫాలోనే జరిగిన మరో సంఘటనలో ఏకంగా 17 మంది చిన్నారులు ఇజ్రాయెల్‌ బాంబులకు బలైపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇద్దరు మహిళలూ ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఆసుపత్రి పరిసరాలు బంధుమిత్రుల రోదనలతో మిన్నంటాయి. శుక్రవారం రాత్రి కూడా టెల్‌ అవీవ్‌ బాంబులకు ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న ఈ రఫా నగరంలో ప్రస్తుతం దాదాపు 12 నుంచి 13 లక్షల మంది పాలస్తీనియన్లు ఉన్నారు. వీరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. వీరిలో ఇజ్రాయెల్‌ దాడుల నుంచి తప్పించుకొని ఉత్తర గాజా, మధ్య గాజా నుంచి తరలివచ్చిన వారే అధికం. అంటే 23 లక్షల మొత్తం గాజా జనాభాలో సగం మంది ఈ నగరంలో ఉన్నట్లే. అంద]ుకే రఫాపై దాడి చేయొద్దని పదే పదే ఇజ్రాయెల్‌ను అమెరికా హెచ్చరిస్తోంది. మరోవైపు అగ్రరాజ్యం ద్వంద్వ వైఖరినే అనుసరిస్తోంది. రఫాపై శనివారం ఇజ్రాయెల్‌ గగనతల దాడులు చేస్తున్న సమయంలోనే ఎప్పటినుంచో పెండింగులో ఉంచిన 26 బిలియన్ల డాలర్ల ఆర్థిక, ఆయుధ ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలపడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని