కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్‌ వీధుల్లో పరుగోపరుగు

రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్‌ వాసులు విస్తుపోయారు.

Published : 25 Apr 2024 04:49 IST

పలువురికి గాయాలు

లండన్‌: రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్‌ వాసులు విస్తుపోయారు. బలిష్ఠంగా ఉన్న ఆ అశ్వాల నుంచి పక్కకు తప్పుకొనేందుకు వాహనదారులు, పాదచారులు నానా తిప్పలు పడ్డారు. ఈ ప్రయత్నంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు కూడా. అయిదింటిలో ఓ గుర్రం రక్తమోడుతూ ఉంది. ఇంతకూ ఏం జరిగిందంటే.. బకింగ్‌హామ్‌ రాజభవనం వద్ద జరుగుతున్న విన్యాసాల సందర్భంగా సమీపాన  నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి వచ్చిన శబ్దానికి  భయపడిన ఈ గుర్రాలు రోడ్ల మీదకు వచ్చి పరుగులు తీశాయి. కింగ్‌ ఛార్లెస్‌-3 పుట్టినరోజు  వేడుకల సన్నాహాల కోసమని ఈ కవాతు ఏర్పాటు చేశారు. ఆల్డ్‌విచ్‌ మార్గంలోని భారత హై కమిషన్‌ కార్యాలయం ఎదురుగా కార్లను, టూరిస్టు బస్సును ఢీకొంటూ గుర్రాలు పరుగెత్తుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ గుర్రాలను అదుపులోకి తీసుకొని, వైద్యచికిత్స అందిస్తున్నట్లు బ్రిటిష్‌ ఆర్మీ అధికారులు తెలిపారు. గాయపడిన ముగ్గురు సైనికులను కూడా ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని