సంక్షిప్త వార్తలు (4)

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు.

Updated : 19 May 2024 06:18 IST

లోయలో పడిన మినీ ట్రక్కు.. పాకిస్థాన్‌లో 14 మంది దుర్మరణం

లాహోర్‌: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన పంజాబ్‌ రాష్ట్రంలో శనివారం చోటుచేసుకుంది. ఖైబర్‌ పక్తుంఖ్వా రాష్ట్రంలోని బన్ను జిల్లా నుంచి పంజాబ్‌లోని ఖుషబ్‌ జిల్లాకు కూలి పనుల కోసం వాహనంలో వీరు వెళుతుండగా.. ఖుషబ్‌ జిల్లాలోని పెంచ్‌ పిర్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలోనే 14 మంది చనిపోయారని, గాయపడ్డ మరో 12 మందిని ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. కాగా అతి వేగం కారణంగా వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడని, అందుకే ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


భారీ వర్షాలతో అఫ్గాన్‌ అతలాకుతలం

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌లో ఆకస్మిక వరదలతో శుక్రవారం 68 మంది మరణించారు. ఏప్రిల్‌లోనూ అకాల వర్షాల వల్ల 70 మంది మృతిచెందారు. ఈ నెలలో వర్షాలతో వాయవ్య రాష్ట్రమైన ఘోర్‌లోనే 50 మంది మరణించారని తాలిబన్‌ అధికారులు తెలిపారు. వేలాది ఇళ్లు, ఆస్తులు నేలమట్టమయ్యాయి. వందల ఎకరాల్లో పంట దెబ్బతింది. ఫరయాబ్‌ రాష్ట్రంలో 18 మంది మరణించగా, 300 పశువులు మృత్యువాత పడ్డాయని.. ఘోర్‌ రాష్ట్రంలో 2,500 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఐక్యరాజ్యసమితి ఆహార సహాయ సంస్థ తెలిపింది. సరైన ఆహారం, పునరావాసం అందకపోవడంతో నిరాశ్రయులు అవస్థలు పడుతున్నారు. 


మరో నౌకపై హూతీల దాడి

దుబాయ్‌: ఎర్ర సముద్రంలో ఆయిల్‌ ట్యాంకర్‌పై శనివారం యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా సైన్యం పేర్కొంది. పనామా జెండాతో వెళుతున్న ఈ నౌకపై బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపింది. నౌకగా పెద్దగా నష్టం జరగలేదని, సిబ్బంది అంతా సురక్షితమని పేర్కొంది. ఈ నౌక.. రష్యా నుంచి చైనాకు వెళుతోంది. దాడి విషయాన్ని హూతీలు ధ్రువీకరించలేదు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడికి నిరసనగా గత కొన్ని నెలలుగా ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై హూతీలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. 


కొత్త ప్రణాళికను ఆమోదించకపోతే వైదొలుగుతా

 ఇజ్రాయెల్‌ వార్‌ కేబినెట్‌ సభ్యుడి హెచ్చరిక

డెయిర్‌ అల్‌-బలా: గాజాలో యుద్ధంపై కొత్త ప్రణాళికను ఆమోదించకపోతే వచ్చే నెల 8వ తేదీన తాను వైదొలుగుతానని ఇజ్రాయెల్‌ వార్‌ కేబినెట్‌ సభ్యుడు బెన్నీ గాంట్జ్‌ స్పష్టంచేశారు. ఆరు అంశాల ఫార్ములాను ఆమోదించాలని ఆయన శనివారం కోరారు. బందీలు తిరిగిరావడం, హమాస్‌ పాలనను అంతమొందించడం, నిస్సైనిక ప్రాంతంగా గాజాను చేయడం, పాలనా వ్యవహారాల కోసం అంతర్జాతీయ ప్రతినిధులను నియమించడం, సౌదీ అరేబియాతో సంబంధాలను పునరుద్ధరించడంవంటి అంశాలు అందులో ఉన్నాయి. వీటిపై 8వ తేదీలోగా తీర్మానం చేయకపోతే వైదొలుగుతానని గాంట్జ్‌ అంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని