సంక్షిప్త వార్తలు(6)

ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులోకి మంగళవారం ఇజ్రాయెల్‌ దళాలు ప్రవేశించి ఏడుగురు పాలస్తీనీయన్లను హతమార్చాయి. ఇందులో ఓ వైద్యుడు కూడా ఉన్నారు.

Updated : 22 May 2024 06:17 IST

వెస్ట్‌బ్యాంకులో ఇజ్రాయెల్‌ సోదాలు
ఏడుగురు పాలస్తీనీయన్ల హత్య

జెనిన్‌ (వెస్ట్‌బ్యాంకు): ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులోకి మంగళవారం ఇజ్రాయెల్‌ దళాలు ప్రవేశించి ఏడుగురు పాలస్తీనీయన్లను హతమార్చాయి. ఇందులో ఓ వైద్యుడు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మొదలైన తర్వాత వెస్ట్‌బ్యాంకులో ఒక సంఘటనలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. జెనిన్‌ నగరంలో మిలిటెంట్ల ఏరివేతకు ఈ ఆపరేషన్‌ను చేపట్టినట్లు ఇజ్రాయెలీ దళాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ విభాగం తెలిపింది. మృతుల్లో తమ ఆసుపత్రి శస్త్రచికిత్స నిపుణుడు కమాల్‌ జబారిన్‌ ఉన్నారని జెనిన్‌ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్‌ విస్సామ్‌ అబూబాకర్‌ తెలిపారు. జబారిన్‌ ఇంటి నుంచి ఆసుపత్రికి వస్తుండగా హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. జెనిన్‌ నగరాన్ని వెస్ట్‌బ్యాంకులో పాలస్తీనా ఉగ్రవాదులకు కేంద్రంగా పేర్కొంటారు. 


మరో అమెరికా డ్రోన్‌ను కూల్చాం: హూతీలు

దుబాయ్‌: తమ గగనతలంపై ఎగురుతున్న మరో అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు మంగళవారం యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అమెరికన్లు ఇంకా ధ్రువీకరించలేదు. ఒక వేళ నిజమైతే, ఇది వారంలో హూతీలు కుప్పకూల్చిన రెండో ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ కానుంది. గత శుక్రవారం కూడా హూతీలు మారిబ్‌ ప్రావిన్సులో అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు పేర్కొన్నారు. 


మిషిగన్‌ యూనివర్సిటీలోకి పోలీసులు

యాన్‌ ఆర్బర్‌ (అమెరికా): పాలస్తీనాకు అనుకూలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న మిషిగన్‌ యూనివర్సిటీలోకి మంగళవారం పోలీసులు ప్రవేశించారు. విద్యార్థుల గుడారాలను తొలగించారు. యూనివర్సిటీ భద్రతకు ఆందోళనకారుల శిబిరం ప్రమాదకరంగా మారిందని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. గాజాలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ నుంచి యూనివర్సిటీ నిధులు స్వీకరించకూడదని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 


ఏపీ వార్తా సంస్థ పరికరాలను జప్తు చేసిన ఇజ్రాయెల్‌

జెరూసలెం: అంతర్జ్జాతీయ వార్తా ఏజెన్సీ.. అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఏపీ)కు సంబంధించిన కెమెరాలను, ప్రసార పరికరాలను ఇజ్రాయెల్‌ జప్తు చేసింది. ఖతార్‌కు చెందిన అల్‌ జజీరా ఛానల్‌పై తాము విధించిన నిషేధాన్ని ఏపీ ఉల్లంఘించిందని, అందుకే చర్యలు తీసుకున్నామని తెలిపింది. మంగళవారం అధికారులు దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఏపీ వార్తా సంస్థ ఉన్న ప్రాంతానికి వెళ్లి.. పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అల్‌ జజీరాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో వార్తా సంస్థలకు లైవ్‌ వీడియో, ఫొటోలు, వార్తలను ఏపీ సంస్థ అందిస్తుంది. ఈ సేవలను అల్‌ జజీరా కూడా వినియోగించుకుంటోంది. తాజా నిర్ణయాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, పరికరాలు అప్పగించాలని అమెరికా డిమాండ్‌ చేసింది.


నైజీరియాలో హింస.. 40 మంది గ్రామీణుల కాల్చివేత

అబూజా: ఉత్తర మధ్య నెజీరియాలోని మారుమూల గ్రామాలపై సోమవారం అర్ధరాత్రి వేళ సాయుధ మూకలు జరిపిన దాడిలో దాదాపు 40 మంది గ్రామీణులు మృతిచెందినట్లు అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. సాయుధులు కాల్పులు ప్రారంభించగానే నలుదిక్కులా పరుగులు తీసిన జనం సమీపంలోని పొదల్లో దాక్కొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఎవరి నుంచీ ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. నీరు, భూమిపై పట్టు కోసం సంచార పశువుల కాపరులు, గ్రామీణ రైతుల నడుమ ఈ ప్రాంతంలో ఏళ్లతరబడి ఈ తరహా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా కొన్ని వందల ప్రాణాలను ఈ దాడులు బలిగొన్నాయి.


అంతరిక్షంలో ఆయుధాల మోహరింపు.. నిషేధంపై ఐరాసలో వీగిన రష్యా తీర్మానం

ఐక్యరాజ్యసమితి: అంతరిక్షంలో సామూహిక జన హనన ఆయుధాలను నిషేధించాలంటూ గత నెలలో అమెరికా, జపాన్‌లు ప్రవేశపెట్టిన తీర్మానం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీగిపోయింది. దీనికి ప్రతిగా అంతరిక్షంలో అన్ని రకాల ఆయుధాల మోహరింపును నిషేధించాలని రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించాలని రష్యా చూస్తోందని అమెరికా, దాని మిత్ర దేశాలు ఆరోపించాయి. రష్యా గత వారమే ఒక ఆయుధాన్ని రోదసిలో ప్రవేశపెట్టిందన్నాయి. రష్యా దీన్ని ఖండించింది. సోమవారం రష్యా తీర్మానంపై ఓటింగ్‌ జరగ్గా రష్యా, చైనా కూటమి నుంచి 7 ఓట్లు అనుకూలంగా, అమెరికా కూటమి నుంచి 7 ఓట్లు ప్రతికూలంగా పడ్డాయి. స్విట్జర్లాండ్‌ ఓటింగ్‌లో పాల్గొనలేదు. తీర్మానం నెగ్గడానికి కావలసిన 9 ఓట్లు రాకపోవడంతో అది వీగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు