‘అవి రక్తంతో తడిసిన చేతులు’

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. నాలుగు దశాబ్దాలుగా ఇరాన్‌ ప్రజలపై కొనసాగుతున్న అణచివేతలో రైసీది కీలక పాత్ర అని పేర్కొంది. న్యాయమూర్తిగా, అధ్యక్షుడిగా ఆయన చేతులు రక్తంతో తడిసాయని, మరణంతో ఈ కఠోర వాస్తవం మారిపోదని తెలిపింది.

Updated : 22 May 2024 06:15 IST

ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ మరణంపై అమెరికా ఘాటు వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. నాలుగు దశాబ్దాలుగా ఇరాన్‌ ప్రజలపై కొనసాగుతున్న అణచివేతలో రైసీది కీలక పాత్ర అని పేర్కొంది. న్యాయమూర్తిగా, అధ్యక్షుడిగా ఆయన చేతులు రక్తంతో తడిసాయని, మరణంతో ఈ కఠోర వాస్తవం మారిపోదని తెలిపింది. ‘‘ఎవరు చనిపోయినా మేం విచారం వ్యక్తం చేస్తాం. హెలికాప్టర్‌ కూలి ఎవరూ మృతి చెందాలని కోరుకోం. అంత మాత్రాన న్యాయమూర్తిగా, అధ్యక్షుడిగా ఆయన చేతులు రక్తంలో తడిసాయన్న వాస్తవమైతే మారిపోదు’’ అని అమెరికా విదేశాంగ విభాగం ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ పేర్కొన్నారు. ఆదివారం హెలికాప్టర్‌ దుర్ఘటనలో ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ, విదేశాంగ మంత్రి హోస్సేన్‌ అమిర్‌ అబ్దొల్లాహియన్‌ తదితరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో తమ సాయాన్ని ఇరాన్‌ కోరిందని, అయితే అందుకు సహకరించలేమని తాము పేర్కొనట్లు మిల్లర్‌ తెలిపారు.

‘‘వివరాల్లోకి పోదలచుకోలేదు. ఇరాన్‌ అధికారులు మా సాయం కోరారు. మేం కూడా సహకరించడానికి సిద్ధమనే చెప్పాం. ఇలాంటి పరిస్థితిలో ఏ ప్రభుత్వానికైనా సాయం చేస్తాం. కాకపోతే రవాణా, ఇతర సాంకేతిక కారణాలతో మేం సహకారం అందించలేకపోతున్నాం’’ అని చెప్పారు. ఇరాన్‌ విషయంలో అమెరికా వైఖరి మారలేదని మిల్లర్‌ స్పష్టం చేశారు. ఆ దేశ ప్రజల హక్కులకు, స్వేచ్ఛకు, ఆకాంక్షలకు తాము అండగా ఉంటామని తెలిపారు. అమెరికా ఆంక్షల కారణంగానే హెలికాప్టర్‌ దుర్ఘటన జరిగిందని ఇరాన్‌ మాజీ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్‌ జవాద్‌ జారిఫ్‌ చేసిన వ్యాఖ్యలపైనా మిల్లర్‌ స్పందించారు. ‘‘ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేందుకు హెలికాప్టర్లను ఇరాన్‌ ప్రభుత్వం వినియోగిస్తోంది. అందుకే వాటిపైనా ఆంక్షలు విధించాం. అయినా ప్రతికూల వాతావరణంలో 45 ఏళ్ల నాటి హెలికాప్టర్లను వాడాలన్న నిర్ణయం ఇరాన్‌ ప్రభుత్వానిది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు