వేసవితాపం.. మధుమేహ, బీపీ బాధితులకు శరాఘాతం

మధుమేహం, అధికరక్తపోటు, ఊబకాయం వంటి జీవక్రియ సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నవారు.. వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆసుపత్రిపాలయ్యే ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 23 May 2024 05:06 IST

ఆసుపత్రిపాలయ్యే ముప్పు వారికి అధికం
అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: మధుమేహం, అధికరక్తపోటు, ఊబకాయం వంటి జీవక్రియ సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నవారు.. వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆసుపత్రిపాలయ్యే ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనం పేర్కొంది. సాధారణ ఉష్ణోగ్రతలున్నప్పటితో పోలిస్తే.. వేడి ఎక్కువగా ఉన్న కాలంలో వారికి ఈ ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని వివరించింది. స్పెయిన్‌లో గత పది వేసవి సీజన్లలో తీవ్ర ఉష్ణోగ్రతల తాకిడికి ఆసుపత్రుల్లో చేరిన కేసులను విశ్లేషించిన బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. ‘‘ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు.. ఊబకాయులనే తీసుకుందాం. వారి శరీరంలోని కొవ్వు.. ఇన్సులేటర్‌గా పనిచేస్తుంది. అందువల్ల ఒంట్లోని అధిక ఉష్ణోగ్రతలకు స్పందించే వ్యవస్థలు అంత సమర్థంగా పనిచేయవు. ఫలితంగా వారు వేసవి తాపానికి సంబంధించిన రుగ్మతల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న హిచామ్‌ అచాబెక్‌ పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలున్నవారు ఆసుపత్రిపాలుకావడానికి అధిక వాయు కాలుష్యం కూడా ఎక్కువగా కారణమవుతోందని వివరించారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్న రోజుల్లో పురుషులు గాయాలతో ఆసుపత్రుల్లో చేరే అవకాశం ఎక్కువని తెలిపారు. మహిళలు మాత్రం ఇన్‌ఫెక్షన్లు, హార్మోన్, జీవక్రియ, శ్వాస లేదా మూత్రాశయ వ్యాధులతో వైద్యులను ఆశ్రయిస్తుంటారని చెప్పారు. 

వేడి అధికంగా ఉన్నప్పుడు చర్మంలోకి ఎక్కువ రక్తం ప్రవహిస్తుందని హిచామ్‌ పేర్కొన్నారు. అలాగే శరీర వేడిని తగ్గించుకోవడానికి చెమట కూడా ఎక్కువగా ఉత్పత్తవుతుందని తెలిపారు. అనంతరం జరిగే చర్యలు.. ఆయా వ్యక్తుల వయసు, వారిలో అప్పటికే ఉన్న అరోగ్య సమస్యలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. మూత్రపిండాల్లో సమస్య ఉన్నవారు, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారికి కూడా ఆసుపత్రిపాలయ్యే ముప్పు అధికమని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని