ఖర్కీవ్‌ స్వాధీనం కోసం ఉక్రెయిన్‌-రష్యా హోరాహోరీ

ఖర్కీవ్‌ ప్రాంతంలో రష్యా సేనలు ఆక్రమించుకున్న భూభాగాలను తమ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌ స్కీ శుక్రవారం ప్రకటించారు. అయితే, రష్యా దీనికి భిన్నమైన కథనాన్ని వినిపిస్తోంది.

Published : 26 May 2024 04:47 IST

కీవ్‌: ఖర్కీవ్‌ ప్రాంతంలో రష్యా సేనలు ఆక్రమించుకున్న భూభాగాలను తమ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌ స్కీ శుక్రవారం ప్రకటించారు. అయితే, రష్యా దీనికి భిన్నమైన కథనాన్ని వినిపిస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన వావ్‌ చాన్‌స్క్‌ పట్టణాన్ని సగానికిపైగా తమ సేనలు ఆక్రమించాయని రష్యా పార్లమెంటు సభ్యుడు విక్తర్‌ వోడోలాట్‌ స్కీ చెప్పారు. రష్యా ఖర్కీవ్‌పై మే 10న దండెత్తినప్పటి నుంచి ఆ ప్రాంతంలోని వావ్‌ చాన్‌స్క్‌ పట్టణంపై పట్టు కోసం హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న తరువాత సమీపంలో మరో మూడు పట్టణాలను కైవసం చేసుకోవడానికి ముందుకు కదులుతామని వోడోలాట్‌ స్కీ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌ వాదనల్లో ఎవరిది నిజమో ఖరారు చేయగల స్వతంత్ర పరిశీలకులెవరూ అందుబాటులో లేరు. ఖర్కీవ్‌ ప్రాంతానికి రాజధాని అయిన ఖర్కీవ్‌ నగరం రష్యా సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. నగరం చుట్టుపక్కల గ్రామాలను ఆక్రమించిన రష్యా సేనలు ఖర్కీవ్‌కు ఫిరంగి గుళ్ల వేటు సమీపంలోకి వచ్చాయి. ఉక్రెయిన్‌ ఈ ప్రాంతం నుంచి 11,000 మందిని ఖాళీ చేయించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని