మెదడును తొలిచేస్తున్న వైరల్‌ డీఎన్‌ఏ!

మానవ డీఎన్‌ఏలో 8 శాతాన్ని పురాతన వైరస్‌ల నుంచి సంక్రమించిన జన్యుక్రమాలే ఆక్రమిస్తున్నాయి. ఈ జన్యుక్రమాలను హ్యూమన్‌ ఎండోజీనస్‌ రెట్రోవైరసెస్‌ (హెర్వ్స్‌)గా పిలుస్తున్నారు. ఇవి వేల సంవత్సరాల నాటివి. ఆధునిక మానవుడు (హోమోసెపియన్‌) ఆవిర్భవించడానికి ముందు నాటివి కూడా అందులో ఉన్నాయి.

Published : 27 May 2024 05:39 IST

తాజా పరిశోధనలో వెల్లడి 

లండన్‌: మానవ డీఎన్‌ఏలో 8 శాతాన్ని పురాతన వైరస్‌ల నుంచి సంక్రమించిన జన్యుక్రమాలే ఆక్రమిస్తున్నాయి. ఈ జన్యుక్రమాలను హ్యూమన్‌ ఎండోజీనస్‌ రెట్రోవైరసెస్‌ (హెర్వ్స్‌)గా పిలుస్తున్నారు. ఇవి వేల సంవత్సరాల నాటివి. ఆధునిక మానవుడు (హోమోసెపియన్‌) ఆవిర్భవించడానికి ముందు నాటివి కూడా అందులో ఉన్నాయి. స్కిజోఫ్రీనియా, బైపోలార్‌ డిజార్డర్, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు కలిగించడంలో కొన్ని పురాతన వైరల్‌ డీఎన్‌ఏ జన్యుక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు అమెరికా, బ్రిటన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.


ఏమిటీ రెట్రోవైరస్‌లు? 

వైరస్‌లు ఇతర జీవుల కణాల్లోకి ప్రవేశించి, ఇన్‌ఫెక్షన్లు కలిగిస్తాయి. రెట్రోవైరస్‌లు ఇలా ఇన్‌ఫెక్షన్లు కలిగించే క్రమంలో తమ జన్యుపదార్థానికి సంబంధించిన ఒక ప్రతిని ఆ కణాల్లోకి ప్రవేశపెడతాయి. మానవ పరిణామక్రమంలో అనేకమార్లు ఈ రెట్రోవైరస్‌లు ఇన్‌ఫెక్షన్‌ కలిగించి ఉంటాయని భావిస్తున్నారు. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన వీర్యం లేదా అండ కణాల్లో ఈ ఇన్‌ఫెక్షన్లు కలిగినప్పుడు.. రెట్రోవైరస్‌లకు సంబంధించిన జన్యుపదార్థం ఆ రోగి సంతానానికీ వెళుతుంది. తద్వారా తదుపరి తరాలకూ వారసత్వంగా సంక్రమిస్తుంది. తొలుత శాస్త్రవేత్తలు హెర్వ్స్‌ను వ్యర్థ డీఎన్‌ఏగా భావించారు. అయితే మానవ జన్యుక్రమంపై మన అవగాహన పెరిగేకొద్దీ ఆ ‘వ్యర్థ డీఎన్‌ఏ’ అనేక విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆ తర్వాత వెల్లడైంది. హెర్వ్స్‌.. ఇతర మానవ జన్యువుల వ్యక్తీకరణను నియంత్రించగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యమైన జీవక్రియలతో ముడిపడ్డ పొరుగు జన్యువుల వ్యక్తీకరణను హెర్వ్స్‌ నియంత్రిస్తున్నట్లు ప్రాథమిక పరిశోధన చెబుతోంది. రక్తం, మెదడులో ఆర్‌ఎన్‌ఏలు, ప్రొటీన్లనూ ఇవి ఉత్పత్తి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి భిన్న రకాల విధులను నిర్వర్తించగలవు. కొన్నిరకాల మానవ జన్యువులు కూడా హెర్వ్స్‌ నుంచే వచ్చాయనడానికి శాస్త్రవేత్తలు ఆధారాలు సేకరించారు. ఉదాహరణకు.. సింక్‌సైటిన్స్‌-1, 2 అనే మానవ జన్యువులు హెర్వ్స్‌ నుంచే సంక్రమించాయి. గర్భంలో శిశువు చుట్టూ ఏర్పడే మాయ అభివృద్ధిలో అవి కీలక పాత్ర పోషిస్తాయి.


మానసిక రుగ్మతల్లో హెర్వ్స్‌ పాత్ర 

మానవ జన్యుక్రమంలో హెర్వ్స్‌ పుష్కలంగా ఉండటం, అవి అనేక విధులు నిర్విర్తించే అవకాశమున్న నేపథ్యంలో కొన్ని రకాల మానసిక రుగ్మతల ముప్పునకు హెర్వ్స్‌తో సంబంధం ఉందా అన్నది శాస్త్రవేత్తలు పరిశీలించారు. శవపరీక్షల సందర్భంగా సేకరించిన 800 మెదడు నమూనాల్లో హెర్వ్స్‌ వ్యక్తీకరణను వారు శోధించారు. ఈ వివరాలను.. వేలమంది మధ్య జన్యు వైరుధ్యాలను విశ్లేషించిన భారీ జన్యు అధ్యయనాలతో పోల్చి చూశారు. ఈ పరీక్షార్థుల్లో మానసిక సమస్యలున్నవారు, లేనివారు ఉన్నారు. ప్రధాన మానసిక రుగ్మతలకు దారితీసే అవకాశమున్న జన్యు కారణాలతో నాలుగు హెర్వ్స్‌కు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో రెండింటికి స్కిజోఫ్రీనియాతో, ఒకదానికి స్కిజోఫ్రీనియాతోపాటు బైపోలార్‌ రుగ్మతతో, మరో హెర్వ్‌కు కుంగుబాటుతో సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. మానసిక సమస్యల్లో అనేక జన్యువులకు పాత్ర ఉందని, వాటిలో హెర్వ్స్‌ కూడా ఒక భాగమని పరిశోధకులు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని