ఎల్వోసీ వెంబడి చైనా రక్షణ నిర్మాణాలు

జమ్మూ-కశ్మీర్‌లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి గత మూడేళ్లుగా పాకిస్థాన్‌ సైనిక రక్షణ సామర్థ్యాన్ని చైనా బలోపేతం చేస్తోంది. ఉక్కు బంకర్లు నిర్మించడంతోపాటు డ్రోన్లనూ పాక్‌కు అందించిందని భారత్‌ అధికార వర్గాలు బుధవారం తెలిపాయి.

Published : 30 May 2024 05:06 IST

కుప్వారా: జమ్మూ-కశ్మీర్‌లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి గత మూడేళ్లుగా పాకిస్థాన్‌ సైనిక రక్షణ సామర్థ్యాన్ని చైనా బలోపేతం చేస్తోంది. ఉక్కు బంకర్లు నిర్మించడంతోపాటు డ్రోన్లనూ పాక్‌కు అందించిందని భారత్‌ అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ఎల్వోసీ వెంట గుప్త సంకేతాలను పంపే కమ్యూనికేషన్‌ టవర్లను, భూగర్భ ఫైబర్‌ కేబుల్స్‌నూ చైనా నిర్మించింది. ఎక్కువ ఎత్తు నుంచి, తక్కువ ఎత్తు నుంచి దూసుకొచ్చే శత్రు విమానాలు, డ్రోన్లను ముందే పసిగట్టే అధునాతన చైనీస్‌ రాడార్‌ వ్యవస్థలనూ ఏర్పాటుచేశారు. ఇంకా సరిహద్దులో పలు చోట్ల ట్రక్కుల మీద అమర్చిన చైనీస్‌ హోవిట్జర్‌ ఫిరంగులు తిరుగుతూ కనిపించాయి. ఎల్వోసీ వెంబడి భూగర్భ బంకర్లు, ఇతర రక్షణ వ్యవస్థలను నిర్మించే పనిలో చైనా ఇంజనీర్లు నిమగ్నమై ఉన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని లీపా లోయలో చైనీయులు సొరంగ నిర్మాణం చేపట్టారు. కారకోరం రహదారికి అన్ని రుతువుల్లో రాకపోకలు సాగించడానికి అనువైన రోడ్డును వారు నిర్మిస్తున్నట్లు భారతీయ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. చైనాలోని షింజియాంగ్‌ రాష్ట్రం నుంచి కారకోరం రహదారి ద్వారా పాక్‌లోని గ్వాదర్‌ రేవు వరకు చైనా-పాక్‌ ఆర్థిక నడవా ప్రాజెక్టు (సీపెక్‌) నిర్మాణంపై చైనా 4,600 కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. ఈ పెట్టుబడులను కాపాడుకోవడానికే పాక్‌ రక్షణ సామర్థ్యాన్ని చైనా పటిష్ఠం చేస్తోంది. భారత నిఘా సంస్థలు ఈ వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని