‘కాల్పుల విరమణ’కు హమాసే అడ్డు

గాజాలో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య పోరు తీవ్రతరమైన వేళ.. పశ్చిమాసియాలో మళ్లీ అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అడుగుపెట్టారు.

Published : 11 Jun 2024 05:12 IST

కైరోలో అమెరికా విదేశాంగ  మంత్రి బ్లింకెన్‌ వ్యాఖ్యలు

ఇజ్రాయెల్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన తమ బంధువు మృతదేహాం వద్ద విలపిస్తున్న పాలస్తీనియుడు

కైరో: గాజాలో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య పోరు తీవ్రతరమైన వేళ.. పశ్చిమాసియాలో మళ్లీ అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అడుగుపెట్టారు. గాజా పోరు ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలో బ్లింకెన్‌ పర్యటించడం ఇది ఎనిమిదో సారి కావడం గమనార్హం. ఆయన సోమవారం కైరోలో ఈజిప్టు అధ్యక్షుడు అల్‌ సిసీతో సమావేశమయ్యారు. ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందంపైనే ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా బ్లింకెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ అంగీకరించిందని, కేవలం హమాసే అడ్డుగా ఉందని పేర్కొన్నారు. ‘‘ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలన్నింటికి నా సందేశం ఒకటే. మీకు కాల్పుల విరమణ కావాలంటే హమాస్‌ను ఒప్పించండి. గాజాలో పాలస్తీనియన్లను రక్షించాలంటే హమాస్‌ను ఒప్పించండి. బందీలంతా క్షేమంగా విడుదల కావాలంటే హమాస్‌ను ఒప్పించండి’’ అని తెలిపారు. అమెరికా విదేశాంగమంత్రి వ్యాఖ్యలను హమాస్‌ ఖండించింది. ఈజిప్టు పర్యటనలో బ్లింకెన్‌ ప్రసంగం ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉందని పేర్కొంది. గాజాలో ఆ దేశం సాగిస్తున్న నరమేధాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అమెరికా చేస్తోందని ఆరోపించింది. మరోవైపు కాల్పుల విరమణతో సంబంధం లేకుండా హమాస్‌ చెరలో ఉన్న తమ దేశానికి చెందిన ఐదుగురు బందీల విడుదల కోసం కూడా అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ మేరకు హమాస్‌పై ఈజిప్టు.. ఇతర దేశాలు ఒత్తిడి ఎక్కువ తేవాలని బ్లింకెన్‌ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు