Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ

ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకలో ఆత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)ని విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చేలా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నట్లు

Updated : 07 May 2022 05:54 IST

శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి..

కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకలో ఆత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)ని విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చేలా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నట్లు అధికార మీడియా విభాగం వెల్లడించింది. ప్రజల భద్రతకు, నిత్యావసర సేవలను నిరాటంకంగా అందించేందుకు ప్రభుత్వ చర్య తోడ్పడుతుందని పేర్కొంది. అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని మహింద రాజీనామా చేయాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు, సమ్మెలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఆత్యయిక పరిస్థితి విధించడం వల్ల ప్రజలను కారణం చెప్పకుండానే అరెస్టు చేసే అధికారం పోలీసులకు, భద్రత బలగాలకు లభిస్తుంది. ఎమర్జెన్సీ విధించడం నెల వ్యవధిలో ఇది రెండోసారి. మరోవైపు అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కొనసాగిస్తున్న ఆందోళనను మరింత ఉద్ధృతం చేయనున్నట్లు శ్రీలంక విద్యార్థులు ప్రకటించారు. జాతీయ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యే ఈ నెల 17న పార్లమెంటును ముట్టడిస్తామని ప్రకటించారు. ఈ లోగా అధ్యక్ష పదవికి గొటబాయ రాజీనామా చేయాలని వారు హెచ్చరించారు. కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా వేల మంది విద్యార్థులు కొలంబోలో పార్లమెంటుకు వెళ్లే ప్రధాన రహదారులను 24 గంటల పాటు దిగ్బంధించారు. ఇంటర్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఐయూఎస్‌ఎఫ్‌) పిలుపుతో గురువారం ప్రారంభమైన ఈ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ధర్నా ముగింపు సందర్భంగా ఐయూఎస్‌ఎఫ్‌ కన్వీనర్‌ వసంత లియనాగే మాట్లాడుతూ...‘ఈ నెల 17న మళ్లీ వస్తాం. పార్లమెంటుకు వెళ్లే మార్గాలన్నీ దిగ్బంధిస్తాం. దీనికన్నా ముందే అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

* శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స అనూహ్యంగా తన మంత్రి మండలి నుంచే వ్యతిరేకతను చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు, ఆందోళనకారులు మాత్రమే ఆయన రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నారు. శ్రుకవారం జరిగిన కేబినెట్‌ భేటీలో మంత్రివర్గ సహచరులు కొందరు ఆయనను పదవి నుంచి వైదొలగాల్సిందిగా సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను మహింద తోసిపుచ్చినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని