ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్‌ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!

జర్మనీ(Germany)కి ఖతార్‌ నుంచి దౌత్యపరమైన ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా..? లేదా..? తెలియాల్సి ఉంది. 

Published : 01 Dec 2023 13:51 IST

దోహా: విదేశీ నేతలకు వారి స్థాయి ప్రకారం ప్రొటోకాల్‌ స్వాగతం ఉంటుంది. ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఇటీవల ఖతార్‌ పర్యటన(Qatar visit)కు వెళ్లిన జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టీన్‌మీర్‌(German President)కు ఇదే విషయంలో చేదు అనుభవం ఎదురైంది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఇటీవల జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ ఖతార్‌ రాజధాని దోహాకు వెళ్లారు. అయితే, ఆ సమయంలో విమానం(Plane) వద్ద ఆయన్ను ఆహ్వానించేందుకు ఖతార్‌ అధికారులు ఎవరూ లేరని మీడియా కథనాలు వెలువడ్డాయి. దాంతో  వాల్టర్‌ విమానం డోర్ వద్దే ఆగిపోయారు. అర్ధగంట పాటు చేతులుకట్టుకొని అక్కడే నిల్చుండిపోయారు.

అయితే అప్పటికే అక్కడ ఖతార్‌లోని జర్మనీ దౌత్యవేత్తతో పాటు గౌరవ వందనం ఇవ్వడానికి సిబ్బంది సిద్ధంగానే ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఎదురైంది. ఖతార్‌ విదేశాంగ శాఖకు చెందిన మంత్రి ఒకరు వచ్చే వరకు జర్మనీ అధినేత ముందడుగు వేయలేదు. దీని తర్వాత కూడా అనుకున్న సమయానికే వాల్టర్.. ఖతార్‌ పాలకుడు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థనీతో భేటీ అయ్యారు.

కైలాస దేశంతో ఒప్పందం.. పరాగ్వే మంత్రి పదవి ఊడగొట్టిన నిత్యానంద

కేవలం మూడుగంటల పాటు జరిగిన ఈ పర్యటనలో ఆయన హమాస్ చెరలో ఉన్న జర్మనీ పౌరుల విడుదల గురించి ప్రధానంగా చర్చించారు. ‘వారి విడుదలకు ఖతార్‌ తనవంతు కృషి చేస్తుందని అనుకుంటున్నాను. క్లిష్టమైన చర్చల సమయంలో..ఎవరూ హామీలు ఇవ్వలేరు’ అని భేటీ అనంతరం మీడియాతో అన్నారు.

అక్టోబర్‌ 7వ తేదీన హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడిజరిపి 240 మందిని బందీలుగా తీసుకెళ్లింది. వారిలో ఇజ్రాయెల్‌ వాసులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు విరమణ, బందీల విడుదలకు ఖతార్‌ రెండు వర్గాల మధ్యవర్తిత్వం చేస్తోంది. ఈ క్రమంలో తమ దేశీయులు విడిపించుకునేందుకు బుధవారం వాల్టర్‌ ఖతార్ వచ్చారు. అయితే, ప్రస్తుత పరిణామం షెడ్యూల్ లోపం వల్లా..? లేక ఉద్దేశపూర్వకమా..? అనేది స్పష్టత లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని