Nithyananda: కైలాస దేశంతో ఒప్పందం.. పరాగ్వే కీలక అధికారి పదవిని ఊడగొట్టిన నిత్యానంద

వివాదాస్పద స్వామిజీ నిత్యానంద స్థాపించిన ‘యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస’తో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే కీలక అధికారి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Updated : 01 Dec 2023 18:13 IST

బ్యూనస్‌ ఎయిర్స్‌: వివాదాస్పద స్వామిజీ నిత్యానంద (Nithyananda) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన స్థాపించిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస (United States of Kailasa)తో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే (Paraguay) వ్యవసాయ శాఖలోని కీలక అధికారి తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఇదే తరహాలో నిత్యానంద దక్షిణ అమెరికాలోని పలువురు ప్రభుత్వాధికారులను తప్పుదోవపట్టించినట్లు సమాచారం. 

ఈ ఏడాది మొదట్లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన ఐరాస సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైలాసతో దౌత్యసంబంధాల ఏర్పాటుకు కృషి చేస్తానని.. అంతర్జాతీయ వేదికలపై కైలాస దేశ సార్వభౌమత్వానికి గుర్తింపు లభించేలా మద్దతు ఇస్తామని పరాగ్వే వ్యవసాయ మంత్రిత్వశాఖలోని ముఖ్య అధికారి అర్నాల్డో చమర్రో ఓ ప్రకటనపై సంతకం చేశారు. దీనిపై పరాగ్వేలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఇదో కుంభకోణమని ఆరోపిస్తూ.. నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తూర్పార పట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో అర్నాల్డో (Arnaldo Chamorro) తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా, కెనడాకు చెందిన స్థానిక నాయకులతో కూడా కైలాస ప్రతినిధులు ఇదే తరహాలో పలు ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. 

కైలాస దేశ ‘ప్రధాని’.. వివాదాల స్వామీజీ!

ఈ ప్రకటన గురించి అర్నాల్డో చమర్రో స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ..‘‘యునైటెడ్‌ స్టేట్స్ ఆఫ్‌ కైలాస ఎక్కడుందో నాకు తెలియదు. మౌలిక సదుపాయాలు, నీటి పారుదలకు సంబంధించి పరాగ్వేకు సాయం చేస్తామని కైలాస ప్రతినిధులు ముందుకు రావడంతో నేను ప్రకటన పత్రాలపై సంతకం చేశాను’’ అని తెలిపారు. మరోవైపు పరాగ్వేలోని స్థానిక మున్సిపాలిటిలతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన ప్రతులను కైలాస సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఉంచడంతో దానిపై తీవ్ర దుమారం చెలరేగింది. గతంలో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్‌ నగర యంత్రాంగాన్ని కూడా కైలాస ప్రతినిధుల ఇదే తరహాలో మోసం చేశారు. ఈ మేరకు నెవార్క్‌ నగర యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది. 

నిత్యానంద భారత్‌లో అత్యాచారం సహా వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన 2019లో దేశం విడిచి పారిపోయారు. తర్వాత ఈక్వెడార్‌ సమీపంలోని ఓ ద్వీపంలో ఉన్నట్లు ఇంటర్‌ పోల్‌ వర్గాలు తెలిపాయి. ఆ ద్వీపానికే యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస అని పేరు పెట్టి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసకు సొంతంగా డాలర్‌, రిజర్వ్‌ బ్యాంకు, జెండా, పాస్‌పోర్టును తీసుకొచ్చారు. అనంతరం కైలాస ప్రతినిధిగా చెబుతూ.. విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఈ ఏడాది ఫిబ్రవరిలో జెనీవాలో జరిగిన ఐరాస సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నిత్యానందను భారత్‌ వేధిస్తోందని ఆరోపించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని