Earthquake: శిథిలాల కింద తమ్ముడికి ఏం కాకూడదని.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఏడేళ్ల బాలిక ఫొటో

ఎంత అల్లరిచేసినా, కొట్టుకున్నా తోబుట్టువుల ప్రేమ, బంధం చాలా గొప్పదని చెప్పే చిత్రమిది. శిథిలాల కింద చిక్కుకున్న ఓ చిన్నారి తన తమ్ముడికి ఏం కాకూడదని 17గంటల పాటు తలపై చేయి పెట్టి కాపాడింది. సిరియా భూప్రళయ భయానక పరిస్థితుల మధ్య కన్పించిందీ హృదయాన్ని హత్తుకునే దృశ్యం.

Published : 08 Feb 2023 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భూకంపం (Earthquake) ధాటికి భవనం కూలడంతో ఆ శిథిలాల్లో చిక్కుకుపోయారో అక్కాతమ్ముడు. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తన బుజ్జి తమ్ముడికి ఏం కాకుండా చూసిందా ఏడేళ్ల బాలిక. ఓవైపు తాను బండరాయి కింద నలిగిపోతున్నా తమ్ముడికి దెబ్బలు తగలకుండా అతడి తలపై చెయ్యి అడ్డుపెట్టింది. హృదయాల్ని మెలిపెట్టిన ఈ దృశ్యం.. ప్రకృతి విపత్తు కారణంగా అల్లకల్లోలంగా మారిన సిరియా (Syria)లో కన్పించింది.

గత సోమవారం తుర్కియేలో చోటుచేసుకున్న భారీ భూకంపం (Earthquake) ధాటికి పొరుగున్న సిరియాలోనూ అనేక ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలి శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది రెండురోజులుగా శ్రమిస్తున్నారు. ఆ సమయంలోనే ఈ దృశ్యం కన్పించింది. ఓ భూకంప ప్రభావిత ప్రాంతంలో శిథిలాలను తొలగిస్తుండగా.. వాటి కింద ఈ అక్కాతమ్ముడు సజీవంగా కన్పించారు. వెంటనే సహాయక సిబ్బంది వారిని బయటకు తీసుకురావడంతో 17 గంటల తర్వాత వారు మృత్యుంజయులుగా విపత్తు నుంచి బయటపడ్డారు.

ఇందుకు సంబంధించిన ఫొటోను ఐక్యరాజ్యసమితి (United Nations) ప్రతినిధి మహమ్మద్‌ సఫా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘శిథిలాల కింద 17 గంటల పాటు తమ్ముడి తలకు చేయి అడ్డుగా పెట్టి కాపాడిన 7 ఏళ్ల బాలిక సురక్షితంగా బయటపడింది. ఈ ఫొటోను ఎవరూ షేర్‌ చేయట్లేదు. ఒకవేళ మరణించి ఉంటే వైరల్‌ అయి ఉండేది. దయచేసి సానుకూల సందేశాలను కూడా షేర్‌ చేయండి’’ అని రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ (Viral Photo)గా మారింది. ‘‘అద్భుతం జరిగింది. ఆమె చాలా గొప్ప అక్క. ధైర్యవంతురాలు’’ అంటూ పలువురు నెటిజన్లను కొనియాడుతున్నారు. పిల్లల ప్రేమ, బంధానికి నిజమైన నిదర్శమంటూ పోస్టులు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు