Israel-Hamas: ఇది హమాస్‌ ‘క్రూరమైన ప్రచారం’.. బందీల వీడియోపై నెతన్యాహు ఫైర్‌

Israel-Hamas: హమాస్‌ విడుదల చేసిన బందీల వీడియోపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) మండిపడ్డారు. మానసికంగా దెబ్బతీసేందుకు వారు క్రూరమైన ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

Updated : 31 Oct 2023 10:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ చెరలో బందీలు (Hostages)గా ఉన్న ముగ్గురు మహిళల వీడియోను హమాస్‌ (Hamas) విడుదల చేసింది. అందులో ఓ మహిళ మాట్లాడుతూ.. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌ (Israel) అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతున్నట్లుగా ఉంది. దీంతో ఈ వీడియోపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) తీవ్రంగా స్పందించారు. అది హమాస్‌ చేస్తున్న ‘క్రూరమైన ప్రచారం’ అని దుయ్యబట్టారు. అసలేం జరిగిందంటే..

హమాస్‌ సోమవారం 76 సెకన్ల నిడివి గల ఓ వీడియోను విడుదల చేసింది. గుర్తుతెలియని ప్రదేశంలో ఆ మహిళలు కూర్చుని కన్పించారు. ఓ మహిళ మాట్లాడుతూ.. ‘‘గత 23 రోజులుగా మేం హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నాం. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌.. గాజాలో భీకర దాడులు చేస్తోందని మాకు తెలిసింది. అయితే, మీ రాజకీయ, భద్రతా కారణాలు, సైనిక వైఫల్యం వల్ల మేం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. మీరు మమ్మల్ని నిజంగా కాపాడాలనుకుంటే.. వారి (పాలస్తీనా) ఖైదీలను విడిచిపెట్టండి. మమ్మల్ని వీరి చెర నుంచి విడిపించండి’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.

ఈ వీడియో కాస్తా వైరల్‌ అవడంతో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. వీడియోలో ఉన్న మహిళలు యెలేనా ట్రుపనోవ్‌, డేనియల్‌ అలోని, రిమన్‌ క్రిష్ట్‌ అని ఇజ్రాయెల్‌ గుర్తించినట్లు తెలిపారు. ‘‘మనల్ని మానసికంగా దెబ్బతీసేందుకు హమాస్‌ చేస్తున్న క్రూరమైన ప్రచారం ఇది. మిమ్మల్ని మేం తప్పకుండా కాపాడుతాం. అపహరణకు గురైన ప్రతి ఒక్కరినీ విడిపిస్తాం. అదృశ్యమైన వారందరినీ ఇళ్లకు చేర్చుతాం’’ అని భరోసా ఇచ్చారు.

హమాస్‌ చెర నుంచి తమ సైనికురాలిని విడిపించుకున్న ఇజ్రాయెల్‌ సైన్యం!

అక్టోబరు 7 నాటి మెరుపుదాడి తర్వాత హమాస్‌.. పలువురు ఇజ్రాయెల్‌, ఇతర దేశాల పౌరులను బందీలుగా తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారి వద్ద దాదాపు 230 మంది బందీలుగా ఉన్నట్లు తెలిసింది. ఖతార్‌ మధ్యవర్తిత్వం వల్ల ఇప్పటి వరకు హమాస్‌ ఇద్దరు అమెరికన్లను, మరో ఇద్దరు వృద్ధులను విడుదల చేసింది. మరో ఇజ్రాయెల్‌ సైనికురాలిని ఐడీఎఫ్‌ సురక్షితంగా విడిపించుకుంది.

అయితే, ఇజ్రాయెల్‌లో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేస్తేనే.. తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేస్తామని హమాస్‌ ప్రతిపాదించింది. దీనిని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తోసిపుచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖైదీలను విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. అంతేగాక.. గాజాలో కాల్పులను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని