Israel-Hamas: హమాస్‌ చెర నుంచి తమ సైనికురాలిని విడిపించుకున్న ఇజ్రాయెల్‌ సైన్యం!

హమాస్‌ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం గాజాస్ట్రిప్‌లో భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలో తమ దేశానికి చెందిన ఓ సైనికురాలిని ఇజ్రాయెల్‌ సైన్యం విడిపించుకుంది. 

Updated : 31 Oct 2023 06:44 IST

జెరూసలెం: హమాస్‌ (Hamas) మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ (Israel) సైన్యం దూకుడు పెంచింది. గాజాస్ట్రిప్‌(Gaza Strip) లో అడుగుపెట్టి హమాస్‌ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే హమాస్‌ చెరలో బందీగా ఉన్న తమ దేశ సైనికురాలు ఒరి మెగిదిష్‌ను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) విడిపించుకుంది. ‘అక్టోబర్‌ 7న ఒరి మెగిదిష్‌ను హమాస్‌ ఉగ్రవాదులు అపహరించారని, తాజాగా తాము జరుపుతోన్న భూతల దాడుల్లో విడిపించుకున్నామని ఐడీఎఫ్‌ ప్రకటన విడుదల చేసింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందని పేర్కొంది. వైద్య పరీక్షలు పూర్తికాగానే కుటుంబసభ్యుల వద్దకు చేర్చినట్లు వెల్లడించింది. మెగిదిష్‌ తన కుటుంబసభ్యులతో కలిసి ఉన్న ఫొటోను ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి కార్యాలయం సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.

భూతల దాడులు ఉద్ధృతం.. 24గంటల్లో 600 స్థావరాలపై దాడి..!

హమాస్‌ చెరలో 239 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. వారిలో 33 మంది చిన్నారులున్నట్లు తెలిపారు. కొంతమంది చిన్నారుల తల్లిదండ్రులను వారి కళ్లెదుటే దారుణంగా హత్య చేశారని, అనంతరం చిన్నారుల్ని చీకటి గదుల్లో బందించారని వివరించారు. ఇజ్రాయెలీ పౌరులే కాకుండా పలువురు విదేశీయులను కూడా హమాస్‌ బందీలుగా చేసుకుందని, వారిలో థాయ్‌లాండ్‌, అమెరికా, జెర్మనీ, ఫ్రాన్స్‌, రష్యాకు చెందిన  వారు ఉన్నట్లు వెల్లడించారు. ఖతార్‌ మధ్యవర్తిత్వం వల్ల ఇప్పటి వరకు హమాస్‌ ఇద్దరు అమెరికన్లను, మరో ఇద్దరు వృద్ధులను విడుదల చేసింది. మరోవైపు ఇజ్రాయెలీలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేస్తేనే.. తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేస్తామని హమాస్‌ ప్రతిపాదించింది. దీనిని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తోసిపుచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖైదీలను విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని