Malaysia: గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి

Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు.

Updated : 23 Apr 2024 11:00 IST

కౌలాలంపూర్‌: మలేసియా (Malaysia)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు  (Helicopters) గగనతలంలో ఢీకొనడంతో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధికారుల కథనం ప్రకారం..

మలేసియాలో ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 26) రాయల్‌ మలేసియన్‌ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందుకోసం పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్‌ సితియావాన్‌ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తూ ఢీకొని కుప్పకూలాయి. వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోగా.. మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది మరణించారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్‌ కమాండర్లు ఉన్నారు. హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

ఇటీవల జపాన్‌లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గత శనివారం అర్ధరాత్రి వేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్లిన రెండు నౌకాదళ హెలికాప్టర్‌లు ఢీకొని సముద్రంలో కుప్పకూలిపోయాయి. ఆ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఏడుగురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని