UK Family Visa: యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు

UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు.

Updated : 12 Apr 2024 16:33 IST

లండన్‌: వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్‌ (Britain) ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. కుటుంబ వీసా (UK Family Visa) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావాలనుకుంటే.. అందుకు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచింది. దీని గురించి యూకే సర్కారు గతేడాదే ప్రకటించగా.. గురువారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.

ఇక నుంచి ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్‌ చేయాలంటే.. వారి కనీస వార్షిక వేతనం 29,000 జీబీపీ (గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్‌)లుగా ఉండాలని యూకే ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఈ పరిమితి 18,600 జీబీపీలుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 55శాతం పెంచారు. అంతేకాదు, వచ్చే ఏడాది నుంచి వృత్తి నిపుణుల వీసా నిబంధనలతో సమానంగా కుటుంబ వీసాల కోసం వేతన పరిమితిని 38,700 పౌండ్లకు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

బ్రిటన్‌లో 12 మంది భారతీయుల అరెస్టు

‘‘దేశంలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్న వేళ ఇంతకంటే సులభమైన పరిష్కారం మాకు కన్పించలేదు. చట్టపరమైన వలసలతో యూకేలోని పన్ను చెల్లింపుదారులపై భారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని బ్రిటన్‌ హోం మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ తెలిపారు.

ఉపాధి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ గతేడాది డిసెంబరులోనే యూకే సర్కారు హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో బిల్లును ప్రవేశపెట్టింది. దాని ప్రకారం.. కుటుంబ వీసా కోసం వేతన పరిమితిని 38,700 డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రధాని రిషి సునాక్‌ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. రెండు దశల్లో ఈ పెంపును అమలు చేస్తామని ప్రకటించింది. ఈ కఠిన నిబంధనలవల్ల ప్రస్తుత వలసల్లో 3 లక్షల మంది వరకూ తగ్గుతారని అప్పట్లో మంత్రి క్లెవర్లీ వెల్లడించారు. కాగా.. ఈ పెంపుతో భారతీయులపైనే అధిక ప్రభావం పడనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని