Israel: నౌకలపై దాడులు ఆందోళనకరం..! నెతన్యాహుతో ప్రధాని మోదీ

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. సముద్ర రవాణా భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 19 Dec 2023 21:13 IST

దిల్లీ: హమాస్‌ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్‌ (Israel) సైన్యం భీకర పోరు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu)తో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధ పరిస్థితులపై ప్రధానంగా చర్చించుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వీలైనంత త్వరగా శాంతి స్థాపన, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలనే భారత వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లు చెప్పారు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలనే డిమాండుతో ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్‌ ఇటీవల మద్దతు పలికిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఎర్రసముద్రంలో ఏకకాలంలో రెండు నౌకలపై దాడి

బాధిత పౌరులకు మానవతా సాయం అందించడాన్ని కొనసాగించాలని ప్రధాని మోదీ సూచించారు. సముద్ర రవాణా భద్రతపైనా ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. కొన్ని రోజులుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేపడుతోన్న విషయం తెలిసిందే. భారత్‌లో తయారైన జెట్‌ ఇంధనాన్ని తీసుకుని వెళ్తోన్న ఓ నౌక కూడా ఇటీవల దాడికి గురైంది. అంతకుముందు తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న ఓ నౌకను హైజాక్‌ చేశారు. ఇదిలా ఉండగా.. యుద్ధం ప్రారంభంలోనూ నెతన్యాహుతో మోదీ మాట్లాడారు. ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని