Houthi rebels: ఎర్రసముద్రంలో ఏకకాలంలో రెండు నౌకలపై దాడి..

ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఏకకాలంలో హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. దీంతో నౌకల రక్షణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అమెరికా ప్రకటించింది.

Updated : 19 Dec 2023 11:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులను మరింత తీవ్రం చేశారు. సోమవారం ‘స్వాన్‌ అట్లాంటిక్‌’ అనే వాణిజ్య నౌకపైకి యెమెన్‌లోని తమ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి ఓ డ్రోన్‌, యాంటీషిప్‌ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించారు. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. సరిగ్గా స్వాన్‌ అట్లాంటిక్‌పై దాడి జరిగే సమయంలోనే మరో బల్క్‌ కార్గో షిప్‌ ఎం/వి క్లారాకు అత్యంత సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ రెండు దాడుల్లో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తమకు సమాచారం లేదని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ చెప్పింది. 

ఈజిప్టు అధ్యక్షుడిగా ఎల్‌ సిసి తిరిగి ఎన్నిక

మరోవైపు హౌతీ వర్గాలు మాత్రం ఈ నౌకలకు ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఉండటంతోనే దాడి చేశామని వెల్లడించాయి. తాము చేసే కాల్స్‌కు నౌకలోని సిబ్బంది స్పందించకపోవడంతో బలప్రయోగానికి దిగినట్లు వెల్లడించాయి. కాగా.. స్వాన్‌ అట్లాంటిక్‌ నౌక నార్వేకు చెందినదిగా తెలుస్తోంది.

ఎర్ర సముద్రంపై అమెరికా దృష్టి..

ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంపై చర్చించేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌.. టెల్‌ అవీవ్‌లో ఉన్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దీనిపై ఆస్టిన్‌ స్పందిస్తూ.. ఎర్ర సముద్రంలో నౌకలపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకు పశ్చిమాసియాలోని రక్షణ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. నౌకల రక్షణ కోసం తాము ‘ఆపరేషన్‌ ప్రాస్పరిటీ గార్డియన్‌’ను ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ బహుళపక్ష భద్రతా కార్యక్రమంలో వివిధ దేశాలతో సంయుక్త సముద్ర బలగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఎర్ర సముద్రంలో కార్యకలాపాలు పర్యవేక్షించే ‘టాస్క్‌ ఫోర్స్‌ 153’ నాయకత్వం వహిస్తుందని చెప్పారు.

ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న వివిధ దేశాల నౌకలపై జరుగుతున్న క్షిపణి, డ్రోన్‌ దాడులను ఎదుర్కొనేందుకు.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రాంతీయ శక్తులు సమష్టిగా పోరాడాలని పేర్కొన్నారు. యెమెన్‌ నుంచి హౌతీ తిరుగుబాటుదారులు నిర్లక్ష్యంగా చేస్తున్న దాడులు వాణిజ్యానికి, నౌకల్లోని అమాయక సిబ్బందికి, అంతర్జాతీయ చట్టాలకు ప్రమాదకరంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రారంభించిన కార్యక్రమంలో బ్రిటన్‌, బహ్రెయిన్‌, కెనడా, ఫ్రాన్స్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, నార్వే, సీషెల్స్‌, స్పెయిన్‌ భాగస్వాములు కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని