Israel Hamas: ఖాళీ అవుతోన్న ‘అల్‌-షిఫా’.. వందలాది పౌరులు బయటకు

గాజాలోనే అతిపెద్దదైన ‘అల్‌-షిఫా’ ఆస్పత్రి ఖాళీ అవుతోంది. ఇది హమాస్‌ కమాండ్‌ సెంటర్‌గా ఉందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే.

Updated : 18 Nov 2023 17:38 IST

ఖాన్‌ యూనిస్: హమాస్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ (Israel) భీకర దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే దక్షిణ గాజాలోని పాలస్తీనీయులంతా తక్షణమే పశ్చిమ ప్రాంతానికి తరలివెళ్లాలని తాజాగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గాజా (Gaza)లోనే అతిపెద్దదైన ‘అల్‌-షిఫా’ ఆస్పత్రి (Al-Shifa Hospital) కూడా ఖాళీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తలదాచుకుంటున్న వందలాది మంది పౌరులతోపాటు రోగులు, వైద్య సిబ్బంది వేరే చోటికి తరలివెళ్లినట్లు గాజా ఆరోగ్య విభాగం వర్గాలు తెలిపాయి.

ఆసుపత్రిని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం తమకు ఆదేశించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే.. తాము అలాంటి ఆదేశాలేమీ జారీ చేయలేదని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. వేరేచోటికి వెళ్లాలని భావిస్తున్న వారికి సురక్షితమైన దారి కల్పిస్తామని మాత్రమే చెప్పినట్లు పేర్కొంది. మరోవైపు గాజాలో కొన్ని చోట్ల ఇంటర్నెట్‌, టెలికమ్యూనికేషన్‌ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. ఉత్తర గాజాపై హమాస్ తన నియంత్రణను కోల్పోయిందని.. ఈ నేపథ్యంలోనే స్వీయ భద్రత కోసం గాజా పౌరులను ఇతర ప్రాంతాలకు వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించింది.

దక్షిణ గాజా నుంచి పారిపోండి.. పాలస్తీనీయులకు ఇజ్రాయెల్‌ తాజా హెచ్చరికలు

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంలో అల్‌-షిఫా కేంద్రంగా కొన్ని రోజులు భీకర దాడులు జరిగిన విషయం తెలిసిందే. హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ ఉన్నట్లు చెబుతున్న ఈ దవాఖానాలోకి ఇజ్రాయెల్‌ దళాలు ఇప్పటికే ప్రవేశించాయి. మరోవైపు.. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తాజాగా ఖాన్ యూనిస్ పట్టణం శివార్లలో ఓ నివాస భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో 26 మంది పాలస్తీనీయన్లు మృతి చెందారని వైద్యులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారు. గాజాలో ఇప్పటివరకు 11,400 మంది మృతి చెందారు. మరో 2700 మంది ఆచూకీ లభించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని