GPS Jamming:: జీపీఎస్‌ జామింగ్‌.. యూరప్‌లో వందల విమానాలపై ఎఫెక్ట్‌!

తూర్పు యూరప్‌లో జీపీఎస్‌ జామింగ్‌ (GPS Jamming) తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Published : 26 Mar 2024 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమానాలకు అత్యంత కీలకమైన నావిగేషనల్‌ సిగ్నల్స్‌కు (GPS Signals) సంబంధించి యూరప్‌లో కొంతకాలంగా తరచూ ఆటంకాలు ఎదురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా తూర్పు యూరప్‌లో జీపీఎస్‌ జామింగ్‌ (GPS Jamming) తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన రెండు రోజుల్లోనే దాదాపు 1600లకు పైగా విమానాలు వీటి బారిన పడినట్లు జీపీఎస్‌ ట్రాకింగ్‌ సైట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు, వీటికి రష్యానే కారణం కావచ్చని పలు యూరప్‌ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

బాల్టిక్‌ ప్రాంతాన్ని నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ సమస్య పీడిస్తున్నట్లు వీటిని ట్రాక్‌ చేసే ఓపెన్‌-సోర్స్‌ ఇంటెలిజెంట్‌ గ్రూప్‌ ఇటీవల వెల్లడించింది. ఈ క్రమంలో గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే 1614 విమానాలు ప్రభావితమైనట్లు పేర్కొంది. పోలాండ్‌, దక్షిణ స్వీడన్‌ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని తెలిపింది. ఫిన్లాండ్‌లోనూ ఇదే పరిస్థితి. బాల్టిక్‌ సముద్రంతోపాటు నాటో దేశాల సమీపంలోకి వచ్చే పౌర విమానాలు ఇటువంటి సమస్య ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఇది సాధారణంగా జరిగే జీపీఎస్‌ జామింగ్‌ కాదని.. గతంలో ఎన్నడూ లేనంతగా జరుగుతోందని వెల్లడించింది. ఇదే సమయంలో జీపీఎస్‌ వ్యవస్థను నిలిపివేసే సామర్థ్యం రష్యాకు ఉందని స్వీడన్‌ ఆర్మీ కూడా ఇటీవల అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.

నౌక ఢీకొనడంతో కుప్పకూలిన బ్రిడ్జ్‌..నదిలో పడిన కార్లు..!

మరోవైపు గతేడాది ఇరాన్‌-ఇరాక్‌ గగనతలంలో విమానాలు తరచూ దారి తప్పుతున్నట్లు వెల్లడైంది. నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ వల్లే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నావిగేషన్‌ వ్యవస్థను సైతం ఏమార్చి విమానాలను తప్పుదోవ పట్టించేంత శక్తిమంతంగా ఆ సంకేతాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

ఏమిటీ సిగ్నల్‌ స్పూఫింగ్‌..

నావిగేషన్‌ వ్యవస్థను ప్రభావితం చేసి, నకిలీ జీపీఎస్‌ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్‌ సిగ్నల్‌ స్పూఫింగ్‌గా వ్యవహరిస్తారు. నిజమైన శాటిలైట్‌ సిగ్నల్స్‌ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్‌ రిసీవర్‌ను తప్పుదోవ పట్టిస్తాయి. ఫలితంగా.. ప్రస్తుతమున్న ప్రదేశం, సమయాన్ని తప్పుగా చూపించేలా చేస్తాయి. ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నప్పటికీ.. పౌర విమానాలే లక్ష్యంగా ఇటీవల మరింత పెరగడం ఆందోళన కలిగించే విషయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు