Donald Trump: అధ్యక్షుడిగా ఎన్నికైతే టిక్‌టాక్‌పై నో బ్యాన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌

తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే టిక్‌టాక్‌ను దేశంలో నిషేధించబోనని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Published : 09 Jun 2024 00:05 IST

వాషింగ్టన్‌: చైనాకు చెందిన సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ను (TikTok) అమెరికాలో నిషేధం విధించే అవకాశాలపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. టిక్‌టాక్‌ను దేశంలో నిషేధించబోనని స్పష్టంచేశారు. ఈ సామాజిక మాధ్యమంపై చర్యలకు సంబంధించిన బిల్లును ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా తొలుత దీనికి పరోక్షంగా మద్దతు పలికారు. అయితే, కొన్ని రోజుల క్రితమే టిక్‌టాక్‌లో చేరిన ఆయన.. తాజాగా నిర్ణయాన్ని మార్చుకున్నట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం వెలువరించింది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ట్రంప్‌.. అక్కడి మీడియా ప్రతినిధి ఛార్లీ కిర్క్‌తో మాట్లాడుతూ టిక్‌టాక్‌ అంశంపై స్పందించారు. ‘మీరు అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌పై నిషేధం విధించబోనని కచ్చితంగా చెప్పగలరా?’ అని ప్రశ్నించగా.. అందులో సందేహమేముంది? నేను ఎప్పటికీ టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయను’ అంటూ ట్రంప్‌ సమాధానమిచ్చారు.

అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించేందుకు వీలుగా అధ్యక్షుడు బైడెన్‌ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి మద్దతుగా 352 మంది ఓటు వేశారు. 65 మంది మాత్రమే వ్యతిరేకించారు. మరోవైపు టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ దాని మెజారిటీ వాటాలను ఉపసంహరించుకోవాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. దీనిని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ వ్యతిరేకిస్తోంది. జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని వాదిస్తోంది. ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యువతను ఆకర్షించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని