Hamas: 200 హమాస్‌ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌ సైన్యం

ఇజ్రాయెల్‌ (Israel) భీకరంగా వైమానిక దాడులను ప్రారంభించింది. నిన్న ఒక్క రాత్రే వందల కొద్దీ హమాస్‌ (Hamas) స్థావరాలపై దాడులు చేసింది. మరోవైపు గాజా పరిస్థితిపై చర్చించేందుకు అమెరికాకు చెందిన కీలక సభ్యుల బృందం ఇజ్రాయెల్‌కు వెళ్లనుంది. 

Updated : 04 Dec 2023 17:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హమాస్‌(Hamas)తో యుద్ధాన్ని పునఃప్రారంభించిన తర్వాత ఇజ్రాయెల్‌ దాడుల తీవ్రతను ఏ మాత్రం తగ్గించలేదు. నిన్న రాత్రి దాదాపు 200 హమాస్‌ లక్ష్యాలపై వైమానిక దళం బాంబింగ్‌ చేసింది. ఐడీఎఫ్‌ దళాలు చేపట్టిన భూతన ఆపరేషన్‌కు మద్దతుగా ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. దీనిపై ఐడీఎఫ్‌ స్పందిస్తూ.. తమ నెగెవ్‌ బ్రిగేడ్‌ గాజాలోని పలు హమాస్‌ స్థావరాలను ధ్వంసం చేసిందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర గాజాలోని బెయిట్‌ హనౌన్‌లో ఉన్న ఓ పాఠశాలలో హమాస్‌ స్థావరాన్ని గుర్తించారు. దీనిని ఇజ్రాయెల్‌ దళాలపై దాడులకు వాడుతున్నట్లు చెప్పారు. ఆ స్కూల్‌ కాంప్లెక్స్‌లోనే దళాలు రెండు సొరంగాలకు చెందిన ద్వారాలను కనుగొన్నాయి. వీటిల్లో ఒక దానిలో ఇజ్రాయెల్‌ దళాల కోసం ఏర్పాటు చేసిన ట్రాప్‌ను గుర్తించి నిర్వీర్యం చేశారు . 

గాజాలో భూతల దాడుల్ని విస్తరించాం: ఐడీఎఫ్‌

క్షిపణులు, గన్స్‌తో సంచరిస్తున్న హమాస్‌ కార్లను తాము ప్రధానంగా లక్ష్యంగా చేసుకొన్నట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్‌ నౌకాదళం కూడా గాజా తీరంలో  హమాస్‌ అబ్జర్వేషన్‌ పోస్టులే లక్ష్యంగా దాడులు చేసింది.

హమాస్‌ చెరలో బందీ హత్య..

బందీగా ఉన్న యోనాతన్‌ సమరానో అనే యువకుడిని  హమాస్‌ హత్యచేసినట్లు ఇజ్రాయెల్‌ దళాలు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశాయి. అతడి మృతదేహం ఇప్పటికీ హమాస్‌ ఆధీనంలోనే ఉందని పేర్కొన్నాయి. అక్టోబర్‌ 7న నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌పై హమాస్‌ దాడి చేసిన సమయంలో ఇతడిని కిడ్నాప్‌ చేసింది. ఆ తర్వాత అతడు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తాను ఒక ఇంట్లో బందీగా ఉన్నానని పేర్కొన్నారు. అనంతరం అతడితో సంబంధాలు తెగిపోయాయి. కొన్నాళ్లకు అతడితో పాటు ఉన్న మిత్రుల మృతదేహాలు బయటపడ్డాయి. అతడిని కూడా హమాస్‌ కాల్చేసినట్లు తర్వాత తెలిసింది. 

యుద్ధం తర్వాత గాజా పరిస్థితిపై చర్చించేందుకు..

యుద్ధం తర్వాత గాజా పరిస్థితిపై చర్చించేందుకు అమెరికాకు చెందిన ఓ బృందం ఇజ్రాయెల్‌కు వెళ్లనున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆధ్వర్యంలోని బృందం ఇజ్రాయెల్‌లోని కీలక అధికారులు, వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనా అథారిటీ నేత మహమూద్‌ అబ్బాస్‌తో భేటీ కానున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని