Israel: గాజాలో భూతల దాడుల్ని విస్తరించాం: ఐడీఎఫ్‌

గాజాపై దాడులను విస్తరిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. తమ భూభాగంపై ఎవరు దాడి చేసినా దానికి తీవ్ర ప్రతిదాడి చేస్తామని, అదే తమ విధానమని ఐడీఎఫ్‌ ప్రతినిధులు వెల్లడించారు. 

Updated : 04 Dec 2023 09:32 IST

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌(Israel - Hamas) మధ్య సంధి ముగిసిన వెంటనే గాజా (Gaza)పై బాంబులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌ దళాలు (IDF).. ఇప్పుడు భూతల దాడులు మరింత విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ‘గాజాస్ట్రిప్‌ వ్యాప్తంగా హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా మా దాడులను విస్తరిస్తున్నాం. మా భూభాగంపై ఎవరు దాడి చేసినా.. వారిపై తీవ్రంగా ప్రతిదాడి చేస్తాం. అదే మా విధానం’ అని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతినిధి డానియల్‌ హగారి తెలిపారు.

గాజాలోని పలు ఆస్పత్రులతో పాటు కిండర్‌గార్డెన్‌, స్కూల్స్‌, ప్రార్థనా మందిరాలను హమాస్‌ మిలిటెంట్లు తమ స్థావరాలుగా చేసుకున్నారు. ఇలాంటి వందలాది స్థావరాలను ఇజ్రాయెల్‌ బయటపెట్టింది. దీని గురించి హగారి మాట్లాడుతూ.. గాజాలోని ప్రజలను ఇజ్రాయెల్‌పై కుట్రకు ఎలా వాడుకున్నారో తెలిపే ఎన్నో సాక్ష్యాలు తాము బయటపెట్టినట్లు తెలిపారు. శని, ఆదివారాల్లో ఇజ్రాయెల్‌ గాజాలోని జబాలియా ప్రాంతంపై దాడులకు పాల్పడింది. పాలస్తీనాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సుఫ్యాన్‌ తయెహ్‌ను ఐడీఎఫ్‌ హతమార్చినట్లు పాలస్తీనా ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. మరోవైపు జబాలియా పరిసర ప్రాంతాల్లో దాడులకు సంబంధించి అక్కడి ప్రజలకు ఐడీఎఫ్ సూచనలు చేసింది. ఏ క్షణంలోనైనా ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాల్సి రావొచ్చని.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని