Gaza: కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలించి.. వివాదాస్పదంగా ఐడీఎఫ్‌ తీరు..

ఇజ్రాయెల్‌ దళాలు గాజాలో భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకొన్నాయి. వీరిని లోదుస్తులతో తరలించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.

Updated : 08 Dec 2023 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌ దళాల వద్ద బందీలుగా ఉన్న గాజా (Gaza) పురుషుల పరిస్థితి దయనీయంగా ఉందని ‘ది యూరో-మెడిటేరియన్‌ హ్యూమన్‌రైట్స్‌ మానిటర్‌’ సంస్థ ఆరోపించింది. గాజాలోని డజన్ల కొద్దీ పురుషులను ఇజ్రాయెల్‌ దళాలు బంధించి వేధిస్తున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు పలువురు పురుషులకు కళ్లకు గంతలు కట్టి లోదుస్తులపై తరలిస్తున్నట్లు ఉన్న ఫొటోలను పోస్టు చేసింది. మరోవైపు వలస వెళుతున్న వారిని, వైద్యులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, వృద్ధులను ఇజ్రాయెల్‌ దళాలు ఏకపక్షంగా అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నాయని తెలిపింది.

పన్నూ హత్య కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి : అమెరికా

అల్‌-అరబి అల్‌-జదీద్‌ వార్తాసంస్థ ఈ ఫొటోలపై స్పందిస్తూ.. వారిలో తమ ప్రతినిది కూడా ఒకరు ఉన్నారని వెల్లడించింది. వీరిని గాజాలోని అల్‌-అరబ్‌ ఆఫీస్‌లో ఇజ్రాయెల్‌ దళాలు అరెస్టు చేశాయని పేర్కొంది. వీరిని అరెస్టు చేశాక దుస్తులు తొలగించి.. ఓ గుర్తుతెలియని ప్రదేశానికి తరలిస్తోందని వెల్లడించింది.  

మరోవైపు ఇజ్రాయెల్‌ మీడియా మాత్రం ఈ చిత్రాలు లొంగిపోయిన హమాస్‌ సభ్యులవని చెబుతోంది. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ప్రతినిధి డానియల్‌ హగారి మాట్లాడుతూ ‘‘మేము బందీలకు సంబంధించి చాలా ఫొటోలను చూశాం. వారు హమాస్‌ ఉగ్రవాదులు. ఇజ్రాయెల్‌ దళాలు గ్రౌండ్‌ ఆపరేషన్‌ సందర్భంగా వీరిని అరెస్టు చేశాయి. ఆ ప్రదేశంలో మిగిలిన హమాస్‌ దళాలు నిదానంగా బయటకు వస్తున్నాయి. ఈ చిత్రాల్లోని వారికి హమాస్‌తో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నాం. ఆ సంస్థను పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఆపరేషన్‌ కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌కు మద్దతు కొనసాగుతుంది: బైడెన్‌

ఇజ్రాయెల్‌కు తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ పునరుద్ఘాటించారు. ఆయన జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-IIతో ఫోన్‌లో మాట్లాడారు. వీరు గాజాలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ ‘‘గాజాలోని పాలస్తీనా వాసులకు మానవీయ సాయం మరింత పెంచేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలపై కలిసి పనిచేయడం ఆపకూడదని ఇరువురు నేతలు నిర్ణయించారు.

హమాస్‌ ముఖ్య నేతల అడ్డాగా భావిస్తున్న గాజా స్ట్రిప్‌లోని ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయెల్‌ బాంబులతో విరుచుకుపడుతోంది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా పౌరులను హెచ్చరించింది. ఇక్కడ హమాస్‌ అధినేత సిన్వర్‌ నివాసాన్ని ఐడీఎఫ్‌ బలగాలు చుట్టుముట్టాయని ప్రధాని నెతన్యాహు తెలిపారు. అయితే తాము ముట్టడించిన ప్రాంతంలో హమాస్‌ అధినేత లేరని ఐడీఎఫ్‌ తెలిపింది. అంగరక్షకులతో కలిసి ఆయన సొరంగాల్లో దాక్కున్నట్లు అనుమానిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని