White House: పన్నూ హత్య కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి : అమెరికా

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్య కుట్రకేసు భారత్‌-అమెరికా మధ్య ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తోంది. తాజాగా శ్వేతసౌధం ఈ కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తును ఆశిస్తున్నట్లు ప్రకటించింది.  

Updated : 08 Dec 2023 17:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Pannun) హత్య కుట్రపై అమెరికా పూర్తి స్థాయి దర్యాప్తు కోరుకుంటోందని శ్వేతసౌధం (White House)  నేషనల్‌ సెక్యూరిటీ విభాగం ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. ‘‘భారత్‌ మా వ్యూహాత్మక భాగస్వామి. మేం ఆ భాగస్వామ్యంపై ఆధారపడ్డాం. అది పసిఫిక్‌లోని క్వాడ్‌ కూటమి సభ్యదేశం కూడా. మేం వారితో కలిసి పలు అంశాలపై పనిచేస్తున్నాం. ఇది నిరాటంకంగా కొనసాగాలని కోరుకుంటున్నాం. అయితే, అదే సమయంలో ఈ ఆరోపణల తీవ్రతను కూడా అర్థం చేసుకొన్నాం’’ అని శ్వేతసౌధం విలేకర్ల సమావేశంలో కిర్బీ అన్నారు. 

అమెరికాలో కాల్పులకు పాల్పడిన ప్రొఫెసర్‌

భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై పన్నూ హత్య కుట్ర ప్రభావం ఏమేరకు ఉంటుందన్న ప్రశ్నకు కిర్బీ స్పందించారు. ‘‘ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి.. బాధ్యులను గుర్తించాలి. ప్రస్తుతం ఆ దర్యప్తు చురుగ్గా జరుగుతోంది. మా భాగస్వామి భారత్‌ దీనిని సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తోంది. కుట్రదారులను గుర్తించి దీనికి బాధ్యులుగా చేయాలని మేము కోరుకుంటున్నాం. విచారణ పూర్తికాకుండా ఏమీ చెప్పలేను’’ అని వెల్లడించారు.

న్యూయార్క్‌లో ఓ సిక్కు వేర్పాటువాదిని హతమార్చడానికి భారత ప్రభుత్వాధికారి ఒకరు కుట్రపన్నారనే ఆరోపణలపై అమెరికా పాలక, ప్రతిపక్ష సెనెటర్లు తీవ్రంగా స్పందించారు. నిన్న జరిగిన సమావేశంలో భారత్‌పై విమర్శలు గుప్పించారు. స్వదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని అసమ్మతివాదులనూ హతమార్చే పన్నాగాలపై సెనెట్‌ విదేశీ వ్యవహారాల సంఘం బుధవారం జరిపిన విచారణలో వారు మాట్లాడారు. ఇందులో సెనెటర్లు ప్రధానంగా చైనాపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టినా భారత్‌, సౌదీ అరేబియా వంటి మిత్రదేశాలకూ చురకలంటించారు.

ఖలిస్థాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూను  హతమార్చడానికి నిఖిల్‌ గుప్తా అనే వ్యక్తి యత్నించాడని.. భారత ప్రభుత్వాధికారి సూచనల మేరకే ఈ కుట్రపన్నాడని నవంబరు 29న అమెరికా ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. మరోవైపు నిఖిల్ గుప్తాను ఈ ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని తమకు అప్పగించాలని ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ కేసును తాము పరిశీలిస్తున్నామని, ఈ హత్యకోసం నిఖిల్‌కు భారత్‌ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని భారత వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి. ఈ హత్య కుట్రలో అతడి ప్రమేయం లేకపోవడంతో అమెరికా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని