Imran Khan: నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణలు

పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 

Updated : 20 Apr 2024 12:06 IST

ఇస్లామాబాద్‌: జైల్లో ఉన్న పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (Imran Khan) సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్‌ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విషపూరిత ఆహారం తిన్న వెంటనే ఆమె కడుపునొప్పితో బాధపడుతున్నారని, ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. 190 మిలియన్ల పౌండ్ల అవినీతి కేసు విచారణలో భాగంగా ఆయన న్యాయమూర్తి ఎదుట ఈ ఆరోపణలు చేశారు. ఆమెకు తగిన వైద్యపరీక్షలు చేయించడం లేదని, తాను ఎవరితోనూ మాట్లాడే పరిస్థితి లేకుండా అదనంగా బ్యారెల్స్‌ ఏర్పాటు చేశారన్నారు. అలాగే కస్టడీలో ఉన్నప్పుడు మీడియాతో మాటలు తగ్గించుకోవాలని విచారణ సందర్భంగా ఇమ్రాన్‌కు న్యాయమూర్తి సూచించారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నందున స్పష్టత ఇవ్వడం కోసం తాను వారితో మాట్లాడుతున్నట్టు మాజీ ప్రధాని తన వాదన వినిపించారు.

ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం కూడా ఇమ్రాన్‌ ఇదే తరహా ఆరోపణలు చేశారు. బుష్రా అరెస్టుకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ కారణమని వ్యాఖ్యలు చేశారు. ఆమెకు శిక్ష విధించిన న్యాయమూర్తే తనతో మాట్లాడినట్లు తెలిపారు. ఒకవేళ తన భార్యకు ఏదైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. తాను బతికున్నంత వరకు మునీర్‌ను వదిలిపెట్టేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. ఆయన తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధ, అక్రమ నిర్ణయాలను బహిర్గతం చేస్తానన్నారు. బుష్రా ప్రస్తుతం ఓ అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇస్లామాబాద్‌ శివారులోని నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని