Imran Khan: ‘భారత్‌లో కేజ్రీవాల్‌కు బెయిల్‌’.. ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు!

భారత్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారం కోసం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ దక్కిందని.. కానీ, ఇక్కడ తాను మాత్రం రాజకీయ అణచివేతకు గురవుతున్నానని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాపోయారు.

Published : 08 Jun 2024 00:02 IST

ఇస్లామాబాద్‌: ఓ కేసులో పాకిస్థాన్‌ (Pakistan) సుప్రీంకోర్టు ముందు హాజరైన ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan).. దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు బెయిల్‌ దక్కింది. కానీ, ఇక్కడ తాను మాత్రం రాజకీయ అణచివేతకు గురవుతున్నానని, జైల్లో తనపై దారుణ వ్యవహార శైలి ఉందని పేర్కొన్నారు.

‘నేషనల్‌ అకౌంటబిలిటీ ఆర్డినెన్స్‌’లో సవరణలకు సంబంధించిన కేసులో సీజేపీ జస్టిస్‌ ఖాజీ ఫయీజ్‌ ఇసా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ముందు ఇమ్రాన్‌ ఖాన్‌ విచారణకు హాజరయ్యారు. 2022లో అధికారం కోల్పోయినప్పటినుంచి తనకు ఎదురైన పరిస్థితులను ఆయన ఏకరవు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికలకు తనను దూరం పెట్టేందుకుగానూ ఐదు రోజుల్లోనే ఓ కేసులో దోషిగా తేల్చారన్నారు. భారత్‌లో ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు అక్కడి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరుచేసిందని, తాను మాత్రం ఇక్కడ అప్రకటికత ‘మార్షల్ లా’ కింద అణచివేతను ఎదుర్కొంటున్నానని వాపోయారు.

దౌత్య విధానాల్లో అది సహజమే.. భారత్‌ను వెనకేసుకొచ్చిన అమెరికా..!

ప్రస్తుత కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరుతూ ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా ఇమ్రాన్‌ నిరాశ వ్యక్తంచేశారు. ‘‘కోర్టులో రాజకీయాలు మాట్లాడానని తీర్పులో పేర్కొన్నారు. అసలు.. నేనేం మాట్లాడాను?’’ అని అడిగారు. ఈ క్రమంలోనే సీజేపీ జోక్యం చేసుకుని.. తీర్పుపై న్యాయమూర్తులు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, దీనిపై రివ్యూ పిటిషన్ వేయొచ్చని సూచించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాల గురించి మాత్రమే మాట్లాడాలని చురకలంటించారు.

దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా సర్వోన్నత న్యాయస్థానం దీన్ని మంజూరుచేసింది. బెయిల్‌ గడువు ముగియడంతో.. కేజ్రీవాల్‌ ఈనెల 2న తిరిగి జైలుకు చేరారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని