USA: దౌత్య విధానాల్లో అది సహజమే.. భారత్‌ను వెనకేసుకొచ్చిన అమెరికా..!

భారత్‌ చర్యలపై చైనా నిరసన వ్యక్తం చేయడాన్ని అమెరికా ఏమాత్రం పట్టించుకోలేదు. న్యూదిల్లీకి మద్దతుగానే స్పందించింది.  

Published : 07 Jun 2024 17:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరువురు దేశాధినేతలు పరస్పరం అభినందించుకోవడం దౌత్య విధానాల్లో అత్యంత సహజమైన ప్రక్రియ అని అమెరికా (USA) అభిప్రాయపడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తైవాన్‌ అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తే పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. దీనిపై చైనా తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపింది. తైవాన్‌ రాజకీయాలను భారత్‌ ప్రతిఘటించాలంటూ డిమాండ్‌ చేసింది. తాజాగా ఈ అంశంపై వాషింగ్టన్‌ స్పందించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్‌ తన రోజువారీ ప్రెస్‌మీట్‌లో స్పందించారు. ‘‘దౌత్య రంగంలో అభినందన సందేశాలు సర్వసాధారణమే’’ అని పేర్కొన్నారు. 

చైనా ఆందోళనలపై మరోవైపు తైవాన్‌ కూడా స్పందించింది. ఆ దేశ విదేశాంగశాఖ స్పందిస్తూ ‘‘ఓ పక్క భారత్‌లో ఎన్నికలు పూర్తికావడంతో ప్రధాని మోదీ మళ్లీ ఎన్నికయ్యారు. ప్రపంచ నేతలు ఆయన్ను అభినందిస్తున్నారు. చైనా దీనిని రాజకీయ బెదిరింపులకు వాడుకొని తప్పుడు ప్రచారం చేస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని గందరగోళానికి గురిచేయడమే దీని లక్ష్యం. దాని నియంతృత్వ పాలన లక్షణాలను ఈ చర్య తెలియజేస్తోంది’’ అని పేర్కొంది. 

బుధవారం తైవాన్‌ అధ్యక్షుడు లాయ్‌ చింగ్ తే నుంచి ప్రధానికి అభినందన సందేశాలు వచ్చాయి. ‘‘ఎన్నికల విజయానికి ప్రధాని నరేంద్ర మోదీకి నా మనస్ఫూర్తి అభినందనలు. భారత్‌-తైవాన్‌ బంధాన్ని వేగంగా బలోపేతం చేసుకోవడంపై నేను దృష్టిపెట్టాను. ఇండో పసిఫిక్‌లో శాంతిని సుసంపన్నతను కాపాడేందుకు మా వాణిజ్య, సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరించుకొంటాం’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు మోదీ బదులిస్తూ.. ‘‘మీ హృదయ పూర్వక సందేశానికి కృతజ్ఞతలు. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలను మేం కోరుకుంటాం. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పరస్పర ప్రయోజనాల కోసం మేం పనిచేస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే, ఈ సంభాషణలపై బీజింగ్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది. దీనిపై న్యూదిల్లీ వద్ద తమ నిరసన వ్యక్తంచేసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ తెలిపారు. తాజాగా భారత్‌ చర్యలకు అమెరికా నుంచి మద్దతు లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు