Car Racing: ప్రేక్షకులపై దూసుకెళ్లిన రేసింగ్‌ కారు.. ఏడుగురి మృతి!

రేసింగ్‌ కారు అదుపుతప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. శ్రీలంకలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

Published : 21 Apr 2024 22:06 IST

కొలంబో: సరదాగా కారు రేసింగ్‌ (Car Racing) చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు విషాదకర ఘటన ఎదురైంది. రేసింగ్‌లో పోటీపడిన ఓ కారు అదుపుతప్పి అతివేగంగా మీదికి దూసుకురావడంతో ఏడుగురు మృతి చెందారు. శ్రీలంక (Sri Lanka)లోని ఉవా ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సైన్యం ఆధ్వర్యంలో దియాతలావాలోని ఫాక్స్‌ హిల్ సర్క్యూట్‌లో ఆదివారం కారు రేసింగ్‌ (Fox Hill Super Cross 2024) నిర్వహించారు.

వాతావరణ వార్తలు చదువుతూ.. సొమ్మసిల్లి పడిపోయిన లేడీ యాంకర్‌

ఈ క్రమంలోనే పోటీలో ఉన్న ఓ కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి ప్రేక్షకులకు ఢీకొంది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఏటా సంప్రదాయ నూతన సంవత్సర వేళ నిర్వహించే ఈ రేసింగ్‌.. ఈస్టర్‌ పేలుళ్ల కారణంగా 2019లో నిలిచిపోయింది. కొవిడ్‌ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో వాయిదా పడుతూ ఐదేళ్లకు పునఃప్రారంభమైంది. అయితే.. తాజా ప్రమాదంతో మరోసారి నిలిచిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని