Operation Indravati: ‘ఆపరేషన్‌ ఇంద్రావతి’.. హైతీనుంచి భారతీయుల తరలింపు షురూ

హైతీలోని భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం.. ‘ఆపరేషన్‌ ఇంద్రావతి (Operation Indravati)’కి శ్రీకారం చుట్టింది. వారిని పొరుగునే ఉన్న డొమినికన్‌ రిపబ్లిక్‌కు తరలిస్తోంది.

Published : 21 Mar 2024 22:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రిమినల్‌ ముఠాల ఆగడాలతో కరీబియన్‌ దేశమైన హైతీ (Haiti)లో కొన్ని వారాలుగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని ‘పోర్ట్‌ ఒ ప్రిన్స్‌’.. దానికి దారి తీసే మార్గాలు సాయుధ గ్యాంగుల చేతిలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వారిని పొరుగునే ఉన్న డొమినికన్‌ రిపబ్లిక్‌ (Dominican Republic) దేశానికి తరలించేందుకుగానూ ‘ఆపరేషన్‌ ఇంద్రావతి (Operation Indravati)’కి శ్రీకారం చుట్టింది. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం 12 మందిని తరలించినట్లు తెలిపారు. విదేశాల్లోని భారతీయుల భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

హైతీని గడగడలాడిస్తోన్న ‘బార్బెక్యూ’ ఎవరు..?

స్థానికంగా సాయుధ ముఠాలతో పోరాడేందుకుగానూ ఐరాస భద్రతా కార్యక్రమం సాయం తీసుకొనేందుకు హైతీ ప్రధాని అరియల్‌ హెన్రీ మార్చి మొదట్లో కెన్యాకు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో పోర్ట్‌ ఒ ప్రిన్స్‌లో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. ప్రధాన కారాగారంపై దాడి చేసి.. దాదాపు 4,000 మంది కరుడుగట్టిన ఖైదీలను క్రిమినల్‌ గ్యాంగులు విడిపించాయి. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. వీరంతా కలిసి రాజధానిని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకొన్నారు. జిమ్మీ చెరిజియర్‌ అలియాస్‌ బార్బెక్యూ అనే మాజీ పోలీస్‌ అధికారి ఈ అల్లర్లకు ప్రధాన కారకుడని అనుమానిస్తున్నారు. ఈ పరిణామాల నడుమ ప్రధాని పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు అరియల్‌ హెన్రీ ఇటీవల ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు