Haiti: ఆ దేశాన్ని గడగడలాడిస్తోన్న ‘బార్బెక్యూ’ ఎవరు..?

హైతీ(Haiti) దేశం ఘర్షణల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇందుకు ప్రధాన కారకుడైన ముఠా నాయకుడు జిమ్మీ చెరిజియర్‌.. ఆ దేశ ప్రధాని దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాడు. 

Updated : 11 Mar 2024 18:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాయుధ మూకల దాడులతో కరీబియన్ దేశం హైతీ(Haiti) అట్టుడుకుతోంది. ప్రధాని అరియెల్ హెన్రీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని ముఠాలు విరుచుకుపడుతున్నాయి. ఇందులోభాగంగా హైతీ (Haiti) రాజధాని పోర్ట్‌ ఒ ప్రిన్స్‌కు వెళ్లే మార్గాలన్నీ ఇప్పటికే క్రిమినల్‌ గ్యాంగుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

కెన్యాతో రక్షణ ఒప్పందం చేసుకోవడానికి ప్రధాని ఏరియల్‌ హెన్రీ ఇటీవల కెన్యా పర్యటనకు వెళ్లిన సమయంలో దేశ రాజధానిలో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. పోలీస్‌స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను  లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టారు. ఈ సమయంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్‌ ఒ ప్రిన్స్‌ జైలుపైనా వీరు దాడులు చేశారు. తీవ్రమైన నేరాలు చేసినవారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలమంది ఖైదీలు తప్పించుకున్నారు. దాంతో దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రస్తుత అస్థిరతకు ‘జీ9 అండ్ ఫ్యామిలీ’ గ్యాంగ్‌ లీడర్ జిమ్మీ చెరిజియర్‌ అలియాస్‌ బార్బెక్యూ (Jimmy Cherizier alias Barbecue)యే ప్రధాన కారకుడు.

ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోన్న జిమ్మీ.. ఇందుకోసం చెడు శక్తులతో సావాసం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఎంతోమందిని సజీవ దహనం చేయడం వల్లే అతడికి బార్బెక్యూ అని పేరొచ్చిందట. కాని, అతను మాత్రం చిన్నప్పుడు తన తల్లి ఆ ముద్దుపేరు పెట్టిందంటున్నాడు. గతంలో హైతీ పోలీసుశాఖలో పనిచేసిన జిమ్మీ.. 2018లో ఉద్యోగం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. లా సలైన్‌ మురుగువాడల్లో అతడు సృష్టించిన నరమేధం వల్లే ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ దుర్ఘటనలో 71 మంది మృతి చెందగా.. ఏడుగురు మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 400 ఇళ్లు కాలిబూడిదయ్యాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అతడు మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని ఆ ఆరోపణలను తోసిపుచ్చాడు. విధుల తొలగింపు తర్వాత నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. మురుగువాడలు, రాజధానికి వెళ్లే మార్గాలను నియంత్రించే ‘జీ9 అండ్ ఫ్యామిలీ’ లీడర్‌గా మారిపోయాడు.

కరడుగట్టిన అల్‌ ఖైదా ఉగ్రవాది మృతి.. అతడి తలపై రూ.40 కోట్ల రివార్డు

 గ్యాంగ్ లీడర్‌గా ఉండటాన్ని అతడు ఒక హోదాగా భావిస్తుంటాడు. తన స్థాయిని ప్రపంచానికి తెలియజేయాలని తహతహలాడే జిమ్మీ.. తరచూ అంతర్జాతీయ మీడియాను ఆహ్వానించి ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. ‘నేను దొంగను కాదు. కిడ్నాప్‌లకు పాల్పడలేదు. అత్యాచారాలు చేయలేదు. మెరుగైన సమాజం కోసం పోరాటం చేస్తున్నానంతే’ అంటూ ఓ సందర్భంలో వ్యాఖ్యలు చేశాడు. అక్కడ ప్రభుత్వం కుప్పకూలితే.. అతడే అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఘర్షణల నేపథ్యంలో హైతీలో అత్యవసర సేవల్లో లేని తమ సిబ్బందిని అమెరికా వాయుమార్గంలో తరలించింది. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా దిగ్భంధంలో ఉండటంతో ప్రధాని హెన్రీ స్వదేశానికి వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ‘రాజధానిలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండి తాళాలు వేసుకున్నారు. బయటకు వచ్చే అవకాశమే లేదు’ అని ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ వెల్లడించింది. పోలీసులు, సాయుధ మూకల మధ్య కాల్పులతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని