Rishi Sunak: ట్రూడో- రిషి సునాక్‌ ఫోన్‌ కాల్‌.. భారత్‌- కెనడా వివాదంపై ఏమన్నారంటే!

కెనడా- భారత్‌ల మధ్య దౌత్యపర ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated : 07 Oct 2023 19:45 IST

లండన్‌: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు విషయంలో కెనడా- భారత్‌ల మధ్య ఇటీవల దౌత్యపర ఉద్రిక్తతలు (Canada- India Row) తలెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) తెలిపారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau)తో ఫోన్‌లో సంభాషించిన సునాక్‌ ఈ మేరకు ఆశాభావం వ్యక్తం చేసినట్లు బ్రిటన్‌ ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’ వెల్లడించింది.

‘భారత్‌లోని కెనడా దౌత్యవేత్తల తాజా పరిస్థితులను రిషి సునాక్‌కు జస్టిన్‌ ట్రూడో వివరించారు. ఈ క్రమంలోనే.. దౌత్య సంబంధాల విషయంలో వియన్నా కన్వెన్షన్ సూత్రాలు సహా సార్వభౌమాధికారం, చట్టపాలనను అన్ని దేశాలు గౌరవించాలనే వైఖరికి బ్రిటన్‌ కట్టుబడి ఉన్నట్లు సునాక్‌ పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తదుపరి చర్యలపై సంప్రదింపులు కొనసాగించేందుకు ఇరు నేతలు అంగీకరించారు’ అని డౌనింగ్‌ స్ట్రీట్‌ తెలిపింది.

అధికంగా ఉన్న కెనడా దౌత్యవేత్తలు వెనక్కి!

ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చంటూ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఇరు దేశాల మధ్య పరస్పర విమర్శలు, దౌత్యవేత్తల బహిష్కరణలు జరిగాయి. కెనడా ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత్‌లో దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని ట్రూడో సర్కారుకు అల్టిమేటం జారీ చేసింది. ఈ క్రమంలోనే దిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న తమ దౌత్యవేత్తలను మలేసియా లేదా సింగపూర్‌కు కెనడా తరలించినట్లు తెలిసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని