India-China: భారత్‌-చైనా సాయుధ ఘర్షణకు అవకాశం: అమెరికా ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు

భారత్‌-చైనా మధ్య సాయుధ ఘర్షణ ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా విభాగం అంచనా వేసింది. 

Published : 14 Mar 2024 15:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-చైనా మధ్య సాయుధ ఘర్షణ జరిగే అవకాశాలున్నాయని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈమేరకు అమెరికాకు చెందిన డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ (డీఎన్‌ఐ) ముప్పు అంచనాల వార్షిక నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఇప్పటికే ఇరు దేశాలు భారీ సంఖ్యలో దళాలను సరిహద్దులకు తరలించాయని పేర్కొంది.    ‘‘ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఇబ్బందికరంగానే ఉంటాయి. సరిహద్దు వివాదం దీనికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. 2020 తర్వాత సరిహద్దుల వద్ద చెప్పుకోదగ్గ ఘర్షణలు చోటు చేసుకోలేదు. కానీ, దళాలను మాత్రం భారీగా మోహరించారు. ఇలాంటి సమయంలో చోటుచేసుకొనే అపోహలు, తప్పుడు అంచనాలతో సాయుధ ఘర్షణ ముప్పు పొంచిఉంది’’ అని డీఎన్‌ఐ తన నివేదికలో వెల్లడించింది.

హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్‌ నౌక హైజాక్‌

డ్రాగన్‌ సైబర్‌ ఆపరేషన్లకు కూడా పదునుపెడుతుందని అంచనా వేసింది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకొనే అవకాశాలున్నాయని హెచ్చరించింది. 2020 ఘర్షణ తర్వాత నుంచి భారత్‌-చైనా సరిహద్దుల్లో ఇన్ఫ్రా ప్రాజెక్టులను చాలా దూకుడుగా చేపడుతున్నాయని అమెరికా నివేదికలో పేర్కొన్నారు. ఇరువైపులా ఎల్‌సీఏ వెంట 50,000 మందిని మోహరించినట్లు వెల్లడించారు. 

ఇస్లామాబాద్‌ వైపు నుంచి ఏమాత్రం బలమైన కవ్వింపు చర్యలు చోటుచేసుకొన్నా.. భారత్‌-పాక్‌ మధ్య సాయుధ ఘర్షణ మొదలయ్యే అవకాశాలున్నట్లు డీఎన్‌ఐ రిపోర్టు వెల్లడించింది. ‘‘భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు 2021 తర్వాత నుంచి కొంత తగ్గాయి. ఈ సమయంలో భారత్‌ దేశీయ అంశాలపై దృష్టిసారించగా.. పాక్‌ అంతర్గతంగా మిలిటెంట్‌ దాడుల కారణంగా ఆందోళన చెందుతోంది. ఈ సమయాన్ని ఏ వర్గం ద్వైపాక్షిక సంబంధాలను బలపర్చుకోవడానికి వినియోగించుకోలేదు. భారత వ్యతిరేక సాయుధ గ్రూపులను బలపర్చిన సుదీర్ఘ చరిత్ర పాక్‌కు ఉంది. ఆ సమయంలో భారత ప్రభుత్వం ఇస్లామాబాద్‌ కవ్వింపులు సాయుధ ఘర్షణకు దారి తీయవచ్చు’’ అని పేర్కొంది.  

ఇప్పటికే జబూటీ, కంబోడియాలో సైనిక స్థావరాలను నిర్మించిన చైనా.. మరిన్ని దేశాల్లో వీటిని ఏర్పాటుచేయడంపై దృష్టిపెట్టవచ్చని అమెరికా అభిప్రాయపడింది. ముఖ్యంగా మయన్మార్‌, క్యూబా, పాకిస్థాన్‌, సీషెల్స్‌, శ్రీలంక, తజికిస్థాన్‌, టాంజానియా, యూఏఈ వంటి దేశాలు బీజింగ్‌ దృష్టిలో ఉన్నాయని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని