Delhi: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్ల దాడి.. భారత్‌ ఏమందంటే..!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి అంశంలో న్యూదిల్లీ స్పందించింది. యుద్ధ భూమిలో చిక్కుకుపోయిన భారతీయులకు ధైర్యం చెప్పింది.

Updated : 14 Apr 2024 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌ (Israel)పై ఇరాన్‌ (Iran) డ్రోన్‌లను ప్రయోగించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. దీంతో అక్కడున్న మన దేశ పౌరులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు జారీ చేసింది. టెల్‌అవీవ్‌-టెహ్రాన్‌ మధ్య శత్రుత్వం పెరగడంపై ఆందోళన చెందుతున్నట్లు న్యూదిల్లీలో విదేశాంగ శాఖ పేర్కొంది.

దాడుల నేపథ్యంలో ఆందోళన చెందొద్దని పౌరులకు ధైర్యం చెప్పింది. స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా  ప్రొటోకాల్‌ను అనుసరించాలని సూచించింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ నంబర్లను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరింది.

ఇజ్రాయెల్‌పై డ్రోన్ల దాడిని ప్రారంభించిన ఇరాన్‌!

భారత్‌ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది..

పశ్చిమాసియాలోని ప్రస్తుత పరిస్థితులను మన విదేశాంగశాఖ జాగ్రత్తగా గమనిస్తోంది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఘర్షణ వాతావరణంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్‌.. ఇరుదేశాలు సంయమనంతో శాంతి మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం ఎంతో ముఖ్యమని.. దౌత్య మార్గంలో ముందుకు సాగడమే మేలని హితవు పలికింది. మరోవైపు.. హర్మూజ్‌ జలసంధి సమీపంలో స్వాధీనం చేసుకున్న నౌకలోని 17 మంది భారతీయుల విడుదల కోసం ఇరాన్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

జీ7 సభ్యదేశ నేతలతో బైడెన్‌ భేటీ..

ఇరాన్‌ చర్యపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌కు తమ మద్దతు తెలియజేశారు. తాము టెల్‌అవీవ్‌కు పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమ పౌరులను రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమన్నారు. ఇరాన్‌ దుందుడుకు చర్యకు ప్రతి స్పందనకు సంబంధించి చర్చించేందుకు జీ7 సభ్య దేశ నేతలతో త్వరలో భేటీ కానున్నట్లు బైడెన్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని