Jaahnavi Kandula: జాహ్నవి కందుల మృతి కేసు.. రివ్యూ కోరిన భారత్‌

జాహ్నవి కందుల(Jaahnavi Kandula) మృతికి కారణమైన అధికారిపై నేరాభియోగాల నుంచి విముక్తి కల్పించడంపై భారత ఎంబసీ స్పందించింది. 

Updated : 24 Feb 2024 11:07 IST

వాషింగ్టన్‌: అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతికి కారణమైన పోలీసు అధికారి కెవిన్‌ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని శనివారం సియాటెల్ భారత రాయబార కార్యాలయం కోరింది.

‘జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాం. తగిన పరిష్కారం కోసం ఈ కేసు గురించి స్థానిక అధికారులు, సియాటెల్‌ పోలీసుల వద్ద గట్టిగా లేవనెత్తాం. సమీక్ష కోసం ప్రస్తుతం ఈ కేసును సియాటెల్‌ అటార్నీ కార్యాలయానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు నివేదిక కోసం వేచిచూస్తున్నాం. ఈ విషయంలో సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని సియాటెల్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసుపై నేరాభియోగాల్లేవ్‌!

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి (Jaahnavi Kandula) 2023 జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే.  సాక్ష్యాధారాలు లేకపోవడంతో డవేపై అభియోగాలు మోపడం లేదని పేర్కొంటూ.. కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ కార్యాలయం రెండురోజుల క్రితం ప్రకటించింది. సీనియర్‌ అటార్నీలతో దీనిపై విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే.. మరోవైపు జాహ్నవి (Jaahnavi Kandula) మృతిని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడిన మరో పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేడని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ అటార్నీ తెలిపారు. చులకనగా మాట్లాడిన అధికారిపై ఇప్పటికే సస్పెన్షన్‌ వేటుపడ్డ విషయం తెలిసిందే. అతనిపై తుది విచారణ మార్చి 4న జరగనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని