అమెరికా అభ్యర్థనకు ఓకే.. కెనడాకు మాత్రం నో: కీలక కేసుల దర్యాప్తుపై భారత దౌత్యవేత్త వ్యాఖ్యలు

India-US-Canada: ఖలిస్థానీ ఉగ్రవాదులు నిజ్జర్‌, పన్నూలకు సంబంధించిన కేసుల్లో అమెరికా, కెనడా కోరిన దర్యాప్తులకు భారత్‌ వేర్వేరుగా స్పందించింది. ఇందుకు స్పష్టమైన కారణం ఉందని కెనడాలోని భారత హైకమిషనర్‌ వెల్లడించారు. అదేంటంటే..?

Updated : 28 Nov 2023 12:41 IST

ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్ పన్నూ హత్యకు  కుట్ర కేసులో అమెరికా (USA) దర్యాప్తునకు భారత (India) ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడా (Canada)లోని భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ (Sanjay Kumar Verma) వెల్లడించారు. కానీ, నిజ్జర్ హత్య కేసులో మాత్రం కెనడా దర్యాప్తునకు దిల్లీ సహకరించబోదని తేల్చిచెప్పారు. సమాచారం పంచుకునే విషయంలో రెండు దేశాల మధ్య ఉన్న తేడా కారణంగానే భారత ప్రభుత్వం స్పందన కూడా వీరి విషయంలో భిన్నంగా ఉందని ఆయన వివరించారు.

కెనడాలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్‌ కుమార్‌ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు తెలిసినంత వరకు.. (పన్నూ హత్య కుట్ర కేసు) దర్యాప్తునకు సంబంధించి అమెరికా అధికారులు నిర్దిష్టమైన సమాచారాన్ని భారత్‌తో పంచుకున్నారు. అమెరికాలో గ్యాంగ్‌స్టర్లు, మాదక ద్రవ్యాల రవాణదారులు, ఉగ్రవాదుల గురించి ఆ దేశం కీలక సమాచారం అందించింది. ఈ కుట్రలో భారత్‌లోని వారికి సంబంధం ఉండొచ్చని అమెరికా భావించింది. ఇక్కడ భారత్‌కు సంబంధం అంటే.. ప్రభుత్వానికి అని కాదు.. 140 కోట్ల మందిలో ఎవరో ఒకరికి అని. న్యాయపరంగా ఆ సమాచారం సమర్థించదగినది కావడంతో అమెరికా దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది’’ అని సంజయ్‌ వర్మ వ్యాఖ్యానించారు.

‘ఇక, నిజ్జర్‌ కేసు విషయానికొస్తే.. దీని దర్యాప్తునకు సంబంధించి కెనడా నుంచి ఎలాంటి నిర్దిష్టమైన సమాచారం లేదా ఆధారాలు అందలేదు. కేసు గురించి ఎలాంటి వివరాలు లేనప్పుడు.. మేం దానిపై ఎలా స్పందించగలం? అందుకే, ఆధారాలివ్వండని మేం అడుగుతున్నాం. ఆ సమాచారం ఇవ్వనంతవరకు కెనడా దర్యాప్తుపై మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. ఈ రెండు కేసుల్లో భారత స్పందన భిన్నంగా ఉండటానికి కారణమిదే’’ అని సంజయ్‌ వర్మ వెల్లడించారు.

నకిలీ ప్రపంచంలో ‘నిజం’ కోసం ఆరాటం

ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూను అమెరికా గడ్డపై హత్య చేసేందుకు జరిగిన కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి భారత్‌తో అమెరికా చర్చించినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. దీనిపై ఇటీవల భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అమెరికా పంచుకున్న సమాచారాన్ని సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయని తెలిపింది.

ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధారమైన, కుట్రపూరిత ఆరోపణలేనని కొట్టిపారేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని