సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్‌ యువతికి కొత్త జీవితం

హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్‌ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు.

Published : 25 Apr 2024 00:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మానవత్వానికి ఎల్లలు లేవనే విషయం మరోసారి రుజువైంది. ఓ భారతీయుడి హృదయం పాకిస్థాన్‌ (Pakistan) యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు చెన్నైలోని ఓ ఆసుపత్రి వైద్యులు చేసిన అవయవ మార్పిడి విజయవంతమైంది. అంతేకాదు వైద్యులు, ఆస్పత్రి, ట్రస్టు.. అందరూ ఒక్క పైసా తీసుకోకుండా ఆమె ప్రాణాలు నిలపడం గమనార్హం.

పాకిస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల రశన్‌ గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు హృదయ మార్పిడి (Heart transplant) చేయకపోతే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు కూడా వ్యాపించే అవకాశం ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. లేదంటే ఆమె ఎక్కువకాలం బతకదంటూ తెలిపారు. ఈ శస్త్రచికిత్సకు సుమారు రూ.35 లక్షలకు పైగా ఖర్చవుతుండడంతో.. తమ కుమార్తె భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రశన్‌ను ఆదుకునేందుకు ఒక స్వచ్ఛందసంస్థ (పేరు తెలపలేదు) ముందుకొచ్చింది.

గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ

ఆమెకు భారత్‌లో సర్జరీకి ఏర్పాట్లు చేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎమ్‌జీఎమ్‌ హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో నిపుణుల బృందం యువతికి.. అవయవదానం చేసిన భారతీయుడి గుండెను విజయవంతంగా అమర్చింది. ఒక్క రూపాయి తీసుకోకుండా ఎంతో శ్రమించి ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. మానవత్వానికి ఎల్లలు అడ్డు కావని నిరూపించింది. ప్రస్తుతం రశన్‌ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కుమార్తె ప్రాణాలు నిలిపినందుకు ట్రస్టు, వైద్య బృందానికి ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని