Sunita Williams: సునీతా విలియమ్స్‌ రోదసి యాత్రకు మళ్లీ సమస్యలు.. ఇక ప్రయోగం వచ్చే నెలలోనే..

Sunita Williams: సునీతా విలియమ్స్‌ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర మళ్లీ వాయిదా పడింది. వచ్చే నెలలో దీనిని చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Published : 23 May 2024 19:41 IST

హ్యూస్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (Sunita Williams) రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. జూన్‌ 1 నుంచి 5వ తేదీల్లో ఈ ప్రయోగం చేపట్టే అవకాశం ఉందని నాసా (NASA) తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.

సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ మే 6వ తేదీనే బోయింగ్‌ స్టార్‌లైనర్‌ (Boeing Starliner) వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి బయల్దేరాల్సింది. చివరి క్షణాల్లో ఈ వ్యోమనౌకను మోసుకెళ్లే బోయింగ్‌కు చెందిన అట్లాస్‌ V రాకెట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. రాకెట్‌లోని ఆక్సిజన్‌ రిలీఫ్‌ వాల్వ్‌ పనితీరు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు.

ఆ తర్వాత పలుమార్లు ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు నాసా ప్రయత్నించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. మే 25న ప్రయోగం చేపట్టే అవకాశాలున్నట్లు చెప్పగా.. ఇప్పుడు మరోసారి దాన్ని వాయిదా వేశారు. వ్యోమనౌకలోని సర్వీస్‌ మాడ్యూల్‌లో చిన్నపాటి హీలియం లీకేజ్‌ ఉన్నట్లు గుర్తించామని, దాన్ని సరిచేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది. జూన్‌ 1న మధ్యాహ్నం 12.25 గంటలకు ప్రయోగం చేపట్టే అవకాశాలున్నట్లు తెలిపింది. అదీ కుదరకపోతే జూన్‌ 2, 5, 6 తేదీల్లో లాంచింగ్‌కు అవకాశాలున్నట్లు పేర్కొంది.

కొత్త అధ్యక్షుడి ప్రసంగం ఎఫెక్ట్‌.. తైవాన్‌కు చైనా ‘పనిష్మెంట్‌’..!

స్టార్‌లైనర్‌ (Boeing Starliner)తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. తాజాది విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇక, సునీతకు (Sunita Williams) ఇది మూడో అంతరిక్ష యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. మునుపటి యాత్రలో భగవద్గీతను తీసుకెళ్లిన ఆమె ఈసారి తన ఆరాధ్య దైవం గణపతి విగ్రహాన్ని వెంట పట్టుకెళ్లనున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని