Elon Musk: భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్‌

Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Updated : 28 Mar 2024 13:37 IST

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి (Corona Pandemic) తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న రోజులవి. ప్రపంచమంతా స్తంభించిపోయింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి కష్టాలను చూసి కెనడాలోని ఓ వైద్యురాలు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో ఆమె తీవ్ర విమర్శలపాలయ్యారు. వైద్యవర్గాలు సైతం ఆమెను తప్పుబట్టాయి. కోర్టులో దావా వేశాయి. ఫలితంగా ఇప్పుడామె ఆ ఫీజులు భరించలేక నిధులను సమీకరించాల్సిన దుస్థితి తలెత్తింది. ఆమెకు బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మద్దతుగా నిలిచారు. ఇంతకీ ఎవరామె?

కరోనా (Coronavirus) వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కెనడా ప్రభుత్వం 2020లో కఠిన లాక్‌డౌన్లు విధించింది. అనంతరం వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేసింది. దీంతో సామాన్యులు ఇబ్బంది పడటంతో భారత సంతతి వైద్యురాలు కుల్విందర్‌ కౌర్‌ గిల్‌ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు. ఎక్స్‌ వేదికగా ఆమె అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీంతో వైద్యవర్గాలు, మీడియా ఆమెపై కోర్టుకు వెళ్లాయి. దీన్ని సవాల్‌ చేసిన కుల్విందర్‌.. తనపై కావాలనే కుట్రపూరితంగా బురద జల్లుతున్నారని న్యాయస్థానంతో దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెను తప్పుబట్టింది. విమర్శకుల గళాన్ని ఆమె అణచివేసేలా ఉందంటూ దావాను కొట్టివేసింది. వారి లీగల్‌ ఖర్చులన్నీ కలిపి మూడు లక్షల కెనడా డాలర్లు (సుమారు రూ.1.85 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీనికి ఈ మార్చి 31 గడువుగా విధించింది.

ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం..డాక్టర్‌ ఫార్ములా షేర్‌ చేసిన హర్ష గోయెంకా

ఇప్పటి వరకు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడానికే తాను సంపాదించిందంతా ఖర్చయిపోయిందని కుల్విందర్‌ వాపోయారు. పైగా అప్పులు కూడా చేయాల్సి వచ్చిందని తెలిపారు. కోర్టు విధించిన జరిమానా చెల్లించడానికి ఆన్‌లైన్‌ వేదికగా నిధుల సమీకరణను ప్రారంభించారు. ఆమెకు దాతలు మద్దతుగా నిలిచారు. ఇప్పటి వరకు రెండు లక్షల కెనడా డాలర్లకు పైగా సమకూర్చారు. ఈ విషయం ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) దృష్టికి వెళ్లింది. వాక్‌ స్వాతంత్ర్యాన్ని రక్షించడంలో భాగంగా ఆమెకు సాయం చేస్తానని ముందుకొచ్చారు. మిగిలిన మొత్తాన్ని తాను అందజేస్తానని హామీ ఇచ్చారు.

తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకించిన కుల్విందర్‌కు వేధింపులు ఎదురవుతున్నాయని ఎక్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. పైగా తమ పాత యాజమాన్యం ఆమె అభిప్రాయాలను సెన్సార్‌ చేసిందని తెలిపింది. ‘కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఓంటారియో’ విచారణ, క్రమశిక్షణా చర్యల వల్ల ఆమె వృత్తిగత జీవితంపైనా ప్రతికూల ప్రభావం పడిందని చెప్పింది. ఈ నేపథ్యంలో మూడు లక్షల కెనడా డాలర్లు చెల్లించడానికి కావాల్సిన మిగిలిన సొమ్మును అందజేస్తామని హామీ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని