SAARC: సార్క్‌ పునరుద్ధరణ ఇప్పట్లో లేనట్లే: విదేశాంగ మంత్రి జైశంకర్‌

SAARC: దిల్లీలో శనివారం జరిగిన ఓ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వివిధ అంశాలపై మాట్లాడారు. సార్క్‌ పునరుద్ధరణ, చైనాతో సంబంధాలు, కొత్త సాంకేతికతలతో దేశ భద్రతకు ఉన్న ముప్పు వంటి అంశాలను చర్చించారు.

Published : 03 Mar 2024 10:53 IST

దిల్లీ: దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (SAARC) తక్షణ పునరుద్ధరణను విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ (S Jaishankar) తోసిపుచ్చారు. సభ్యదేశమైన పాకిస్థాన్‌ (Pakistan) ఉగ్రవాద అనుకూల వైఖరే అందుకు అవరోధమని కుండబద్దలు కొట్టారు. ఈ కూటమిలోని ఇతర దేశాలపైనా పాక్‌ అదే తీరును అనుసరిస్తోందని దుయ్యబట్టారు. దిల్లీలో శనివారం జరిగిన ‘అనంత ఎస్పెన్‌ సెంటర్‌’ నిర్వహించిన సమావేశంలో పాక్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సార్క్‌ భవిష్యత్తు పూర్తిగా పాక్‌ అనుసరించే విధానంపైనే ఆధారపడి ఉంటుందని జైశంకర్ (S Jaishankar) తేల్చి చెప్పారు. ఓవైపు చర్చల పేరిట ఒక చోటకు చేరి.. మరోవైపు అదే రాత్రి దాడులకు పాల్పడితే ఎలా అని పరోక్షంగా ఆ దేశం తీరును ఎండగట్టారు. ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నెలకొల్పి వారిని సరిహద్దుల వైపు ఉసిగొల్పే సభ్య దేశం ఉన్న సార్క్‌ను ముందుతీసుకెళ్లడం ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. సార్క్‌ (SAARC) చివరి సమావేశం 2014లో కాఠ్‌మాండూలో జరిగింది. 2016లో ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉన్నప్పటికీ.. భారత్‌ దాన్ని బహిష్కరించింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌ 18న జమ్ముకశ్మీర్‌లోని ఉరి సైనిక శిబిరంపై ఉగ్రదాడి జరగడమే అందుకు కారణం. ఆ తర్వాత బంగ్లాదేశ్‌, భూటాన్‌, అఫ్గానిస్థాన్‌ సైతం సమావేశంలో పాల్గొనడానికి నిరాకరించాయి.

పాక్‌ ప్రధాని ఎన్నిక నేడు

సార్క్‌కు బదులు బిమ్‌స్టెక్‌ (బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ మల్టీ-సెక్టోరల్‌ టెక్నికల్‌, ఎకనామిక్‌ కోఆపరేషన్‌) కూటమి కింద సహకారం బలపడుతోందని జైశంకర్‌ తెలిపారు. ఇక్కడ కూడా సమస్యలు ఉన్నప్పటికీ.. సార్క్‌తో ఉన్నవాటితో పోలిస్తే చాలా భిన్నమైనవని వివరించారు. పరస్పర సహకారంతో ముందుకెళ్లాలనే ఆకాంక్ష ఈ కూటమి సభ్యదేశాల మధ్య బలంగా ఉందన్నారు.

చైనాతో సంబంధాలపై..

సరిహద్దు ఒప్పందాలకు చైనా (China) కట్టుబడి ఉండాలని జైశంకర్‌ స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వెంట శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి సహకరించాలన్నారు. అప్పుడే భారత్‌- చైనా మధ్య సంబంధాలు మెరుగవుతాయని తెలిపారు. ఆ దేశంతో వ్యవహరించే విషయంలో గత ప్రభుత్వాలు అంతర్జాతీయ సంబంధాలను ప్రభావవంతంగా వినియోగించుకోలేదని వివరించారు. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా తిప్పికొట్టాలంటే సాంకేతికత, సరఫరా వ్యవస్థల వంటి వాటిని భారత్‌ బలంగా నిర్మించుకోవాలని చెప్పారు.

అత్యాధునిక సాంకేతికతల ముప్పు..

జాతీయ భద్రతకు సరిహద్దుల వద్ద ముప్పు, ఉగ్రవాదం మాత్రమే సవాళ్లు కాదని జైశంకర్‌ అన్నారు. కృత్రిమ మేధ (AI), డీప్‌ఫేక్‌ల వంటి అత్యాధునిక సాంకేతికతల నుంచీ సమస్యలు ఎదురవుతున్నాయని వెల్లడించారు. దేశీయ అంతర్గత విషయాల్లో సైబర్‌ మార్గాన బయటి శక్తుల జోక్యం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని