పాక్‌ ప్రధాని ఎన్నిక నేడు

పాకిస్థాన్‌ ప్రధాని ఎన్నిక ఆదివారం జరగనుంది. పాక్‌ ముస్లింలీగ్‌ - నవాజ్‌ (పీఎంఎల్‌ - ఎన్‌) పార్టీ అగ్రనేత షెహబాజ్‌ షరీఫ్‌ (72) దేశ 33వ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయం.

Updated : 03 Mar 2024 04:09 IST

మళ్లీ షెహబాజ్‌ షరీఫ్‌ చేతికే పగ్గాలు!
ఇమ్రాన్‌ వర్గ అభ్యర్థిగా ఒమర్‌ అయూబ్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఎన్నిక ఆదివారం జరగనుంది. పాక్‌ ముస్లింలీగ్‌ - నవాజ్‌ (పీఎంఎల్‌ - ఎన్‌) పార్టీ అగ్రనేత షెహబాజ్‌ షరీఫ్‌ (72) దేశ 33వ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయం. పీఎంఎల్‌-ఎన్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)ల తరఫున ప్రధాని పదవికి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న షెహబాజ్‌ ఇప్పటికే తన నామినేషను పత్రాలను సమర్పించారు. షెహబాజ్‌కు పోటీగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ నుంచి ఒమర్‌ అయూబ్‌ఖాన్‌ నామినేషను వేశారు. ప్రధాని ఎన్నికకు జాతీయ అసెంబ్లీలో ఆదివారం ఓటింగు జరగనుంది. విజేతగా నిలిచిన అభ్యర్థి ప్రధానమంత్రిగా సోమవారం అధ్యక్ష భవనంలో ప్రమాణస్వీకారం చేస్తారు. కాగా, బలూచిస్థాన్‌ ప్రావిన్సు ముఖ్యమంత్రిగా పీపీపీ అభ్యర్థి సర్ఫరాజ్‌ బగ్టీ శనివారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

అధ్యక్ష బరిలోనూ ఇమ్రాన్‌ అభ్యర్థి

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతు కలిగిన సున్నీ ఇత్తేహాద్‌ కౌన్సిలు మార్చి 9న జరగనున్న అధ్యక్ష పదవి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా పష్తున్‌ఖ్వా మిల్లి అవామీ పార్టీ అధినేత మహమూద్‌ఖాన్‌ అచక్‌జాయ్‌ (75)ను శనివారం నామినేట్‌ చేసింది. అనుభవజ్ఞుడైన అచక్‌జాయ్‌కు మద్దతు ఇవ్వాలని ఇమ్రాన్‌ఖాన్‌ జైలు నుంచే తమ పార్టీ చట్టసభ సభ్యులను కోరినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. మరోవైపు.. పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీలు తమ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు అసిఫ్‌అలి జర్దారీ (68)ని ప్రకటించాయి. పాక్‌ నిబంధనల మేరకు జాతీయ అసెంబ్లీ, సెనేట్‌, నాలుగు ప్రావిన్సుల అసెంబ్లీలు అధ్యక్షుణ్ని ఎన్నుకుంటాయి.

ఇమ్రాన్‌కు 4 కేసుల్లో మధ్యంతర బెయిల్‌

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గతేడాది మే 9 నాటి అల్లర్లతో సంబంధమున్న నాలుగు కేసుల్లో పాక్‌ కోర్టు మధ్యంతర బెయిలు మంజూరుచేసినట్లు శనివారం మీడియా కథనాలు పేర్కొన్నాయి. అవినీతి కేసులో ఇమ్రాన్‌ అరెస్టు అయిన సందర్భంగా ఈ అల్లర్లు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని