International Court of Justice: రఫాపై సైనికచర్యను తక్షణం ఆపండి

అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఇజ్రాయెల్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. రఫాపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని శుక్రవారం ఐసీజే ఆదేశాలిచ్చింది.

Published : 25 May 2024 06:32 IST

మానవతా సాయం అందించండి
రఫా క్రాసింగ్‌ను తెరిచి. ఐరాస దర్యాప్తు సంస్థలను అనుమతించండి
ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం

గాజా సరిహద్దులో ఇజ్రాయెల్‌ సైనికులు

ది హేగ్‌: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఇజ్రాయెల్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. రఫాపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని శుక్రవారం ఐసీజే ఆదేశాలిచ్చింది. అంతేకాదు.. గాజాకు మానవతాసాయం అందేలా రఫా క్రాసింగ్‌ను తెరవాలని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి(ఐరాస) దర్యాప్తు సంస్థలను, నిజ నిర్ధారణ కమిటీలను గాజాలోకి అనుమతించాలని కూడా స్పష్టం చేసింది. నెలలోగా తమ ఆదేశాల అమలుకు సంబంధించిన పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని కూడా ఇజ్రాయెల్‌కు తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికా వేసిన పిటిషన్‌పై శుక్రవారం 15 న్యాయమూర్తుల ఐసీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను టెల్‌ అవీవ్‌ ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడింది. గాజా నుంచి పూర్తిగా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌కు ఆదేశాలివ్వాలని దక్షిణాఫ్రికా చేసిన వినతికి ఐసీజే సానుకూలంగా స్పందించలేదు. కాల్పుల విరమణ ఆదేశాలివ్వాలంటూ చేసిన విజ్ఞప్తినీ తిరస్కరించింది. ఈ ఉత్తర్వులను ఇజ్రాయెల్‌ పాటించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌ చర్యలతో పాలస్తీనియన్ల హక్కులకు కోలుకోలేని హాని కలిగే ప్రమాదం ఉందని తీర్పును వెలువరిస్తూ ఐసీజే అధ్యక్షుడు జడ్జి నవాఫ్‌ సలామ్‌ వ్యాఖ్యానించారు. ‘‘గాజా స్ట్రిప్‌లోని పౌరుల భద్రతను మెరుగుపరచడానికి, ముఖ్యంగా ఇటీవల రఫా నుంచి తరలిన వారి భద్రత కోసం ఇజ్రాయెల్‌ చేపట్టిన ఏర్పాట్లు, ఇతర చర్యలు సరిపోతాయని ఈ న్యాయస్థానం భావించడం లేదు. రఫాలో సైనిక దాడి ఫలితంగా పాలస్తీనియన్లు ప్రమాదం అంచున ఉన్నారు’’ అని పేర్కొన్నారు.


మరో ముగ్గురు బందీల మృతదేహాల లభ్యం

హతులైన బందీలు మైకేల్‌ నిసెన్‌బామ్, ఒరియన్‌ హెర్నాండెజ్, హనాన్‌ యొబ్లొంకా

టెల్‌ అవీవ్‌: గాజాలోని జబాలియా ప్రాంతంలో ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం అయ్యాయని శుక్రవారం ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. వీరిని హనాన్‌ యొబ్లొంకా, మైకేల్‌ నిసెన్‌బామ్, ఒరియన్‌ హెర్నాండెజ్‌లుగా గుర్తించింది. అక్టోబరు 7న సూపర్‌నోవా ఫెస్టివల్‌పై దాడి చేసిన రోజే వీరిని హమాస్‌ హతమార్చిందని, మృతదేహాలను గాజాకు తరలించిందని ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. మొత్తం 250 మందిని హమాస్‌ బందీలుగా గాజాకు తీసుకువచ్చింది. ఇందులో సగం మందిని నవంబరులో జరిగిన కాల్పుల విరమణ సందర్భంగా విడుదల చేసింది. ఇంకా 100 మంది హమాస్‌ చెరలో ఉన్నారని, 39 మృతదేహాలు కూడా వారి దగ్గర ఉన్నాయని ఇజ్రాయెల్‌ చెబుతోంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని